
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జులై 6) జరిగిన తొలి మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కీరన్ పోలార్డ్ ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు.
తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టిన పోలీ.. 36 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఎంఐకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆతర్వాత బౌలింగ్‌లో ఓ మ్యాచ్ విన్నింగ్ ఓవర్ (చివరి 2 ఓవర్లలో 21 పరుగులు కావాల్సి తరుణంలో 19వ ఓవర్‌లో వికెట్ తీసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు) వేసి ఎంఐ గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
ఈ గెలుపుతో ఎంఐ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో మూడో విజయం సాధించి, సియాటిల్ ఓర్కాస్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీపడుతుంది. ఓర్కాస్ ఇవాళే తమ చివరి మ్యాచ్‌లో ఓడి తమ విజయాల సంఖ్యను మూడు వద్దే ముగించింది.
ప్రస్తుతం ఓర్కాస్, ఎంఐ తలో 6 పాయింట్లతో ఉన్నప్పటికీ ఎంఐకు ఇంకో మ్యాచ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎంఐ ఆ మ్యాచ్‌లో ఓడినా, భారీ తేడాతో ఓడకపోతే ఓర్కాస్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.
ఎంఐ రేపు జరుగబోయే మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడంతో తలపడనుంది. కాగా, ఈ సీజన్‌లో టెక్సస్ సూపర్ కింగ్స్, శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ ఫ్రీడం ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.
మ్యాచ్ వివరాల్లోకి వెళితే..తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. పోలార్డ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. పూరన్ 30, మొనాంక్ పటేల్ 13, డికాక్ 0, తజిందర్ డిల్లాన్ 2, బ్రేస్‌వెల్ 18, జార్జ్ లిండే 13, బౌల్ట్ 7, కెంజిగే 1 పరుగు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 3, హోల్డర్, కోర్నే డ్రై తలో 2, సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. ఎంఐ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎంఐ బౌలర్లలో బౌల్ట్, లిండే, ఉగార్కర్ వికెట్లు తీయనప్పటికీ పొదుపుగా తమ కోటా ఓవర్లు పూర్తి చేశారు. కెంజిగే, పోలార్డ్ తలో వికెట్ తీశారు.
నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఉన్ముక్త్ చంద్ (59 రిటైర్ట్ ఔట్) హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ చాలా నిదానంగా ఆడాడు. ఇదే నైట్‌రైడర్స్ కొంపముంచింది. ఉన్ముక్త్ 48 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఆండ్రీ ఫ్లెచర్ 9, అలెక్స్ హేల్స్ 21, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 29, రసెల్ 9 (నాటౌట్), హోల్డర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.