
భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ (Indv vs Pak) అంటే అభిమానుల్లో అంచనాలు తారస్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థులు పరస్పరం తలపడుతూ ఉంటే.. ఇరు దేశాల అభిమానులు తామే స్వయంగా పోటీపడుతున్నట్లుగా భావిస్తారు. వీరి పరిస్థితే ఇలా ఉంటే.. మైదానంలో నేరుగా ఢీకొట్టే ఆటగాళ్లు ఒక రకంగా భావోద్వేగాలతో యుద్ధం చేస్తారనడంలో అతిశయోక్తి లేదు.
అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ క్రీడా స్పూర్తితో మెలిగే వారే నిజమైన ఆటగాళ్లు అనిపించుకుంటారు. భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ (Mithali Raj) కూడా ఈ కోవకే చెందుతుంది. పాకిస్తాన్ మహిళా జట్టుతో మ్యాచ్ సందర్భంగా తన పట్ల ప్రత్యర్థి టీమ్ ప్లేయర్ అనుచితంగా ప్రవర్తించినా ఆమె సహనం కోల్పోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే సదరు ప్లేయర్‌తో రిఫరీ ద్వారా ‘లెక్క’ తేల్చుకుంది.
నన్ను అసభ్యంగా దూషించింది
ఈ విషయాన్ని మిథాలీ రాజ్ స్వయంగా తాజాగా వెల్లడించింది. ‘‘టీ20 ప్రపంచకప్ సమయంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు నేను బ్యాటింగ్ చేస్తున్నా. ఇంతలో పాక్ మహిళా క్రికెటర్ వచ్చి మైదానంలో నన్ను అసభ్యంగా దూషించడం మొదలుపెట్టింది.
అసలు ఆమె అలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు. నేను అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ఆమె బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోంది. అప్పుడు కూడా నన్ను దూషించింది. నేను మాత్రం అందుకు బదులు ఇవ్వాలని అనుకోలేదు.
కరచాలనం చేసే సమయంలోనూ నా చేతిపై కొట్టింది. ఈ విషయం గురించి మా మేనేజర్‌తో చెప్పాను. వాళ్లు మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది హై వోల్టేజీ మ్యాచ్.. ఇలాంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి అని రిఫరీ చెప్పారు.
తప్పును అంగీకరించి.. క్షమాపణలు చెప్పించారు
అయితే, ఇలాంటి విషయాలు పాక్ జట్టు మేనేజ్‌మెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నేను నిశ్చయించుకున్నాను. వాళ్లు తమ తప్పును అంగీకరించడంతో పాటు ఆమెతో నాకు క్షమాపణలు చెప్పించారు. ఆటలో పోటీపడాలి కానీ.. అకారణంగా ఇతరులను దూషించడం సరికాదు’’ అని మిథాలీ రాజ్ ది లలన్‌టాప్‌నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది.
కాగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సేవలు అందించిన మిథాలీ రాజ్.. 232 వన్డేలు, 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20లు ఆడింది. టెస్టుల్లో 699 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ.. వన్డేల్లో ఏడు శతకాల సాయంతో 7805 పరుగులు సాధించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 17 హాఫ్ సెంచరీలు కొట్టి 2364 రన్స్ రాబట్టింది.