భారత క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు దూరమైన సమయంలో తాను కుంగిపోలేదన్నాడు. అందుకు బదులు దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు.
రెండున్నరేళ్లు
కాగా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా బీసీసీఐ దాదాపు రెండున్నరేళ్లు ఇషాన్‌ను పక్కనపెట్టింది. దీంతో జాతీయ జట్టుకు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... ఆ తర్వాత దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించాడు.
దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్... 500 పైచిలుకు పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడికి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్.
ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర
సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ కివీస్‌పై సత్తా చాటిన ఇషాన్.. ఆ తర్వాత వరల్డ్‌కప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా వరుసగా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు.
ఇక ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించిన ఇషాన్ జట్టుకు హ్యాట్రిక్ విజయాలు అందించాడు.
ఇక రాజస్తాన్ రాయల్స్‌తో నివారం జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 74 పరుగులు చేసిన ఇషాన్ జట్టును గెలిపించాడు. ఇందుకు గానూ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా పునరాగమనంపై స్పందించాడు.
బాధపడుతూ కూర్చుంటే ఏమీ రాదు
‘నేను భారత జట్టుకు దూరంగా ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదని నాకు నేను సర్ది చెప్పుకున్నా. బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిరిగి జట్టులో చోటు దక్కాలంటే పరుగులు సాధించడమే మార్గం. అందుకే ఆటపై దృష్టి పెట్టా. మరింత మెరుగవుతూ నిలకడగా పరుగులు సాధించడం అలవాటు చేసుకున్నా.
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో మరింత అంకితభావంతో ఆడా. ఒక సీజన్‌లో 300 పరుగులు చేసినా పిలుపు రాకపోతే... 400, 500 ఇలా పరుగుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నా. చాన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడటం అలవాటైంది. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.
చేసిన తప్పులు పునరావృతం కాకుండా... ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నా’ అని ఇషాన్ కిషాన్ పేర్కొన్నాడు. ఇక 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో రెండు సెంచరీలు నమోదు చేసిన వైభవ్‌పై ఇషాన్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అతడు బంతిని బాదుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నాడు.


