‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’ | LSG Captain Rishabh Pant Comments After Match Won Vs KKR IPL 2026 | Sakshi
Sakshi News home page

‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’

Apr 10 2026 9:13 AM | Updated on Apr 10 2026 11:13 AM

LSG Captain Rishabh Pant Comments After Match Won Vs KKR IPL 2026

Photo Courtesy: IPL 2026

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చిందని లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ తెలిపాడు. ముకుల్‌ చౌదరీ ప్రదర్శనపై మాటలు రావడం లేదని పంత్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో గురువారం లక్నో 3 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.  

మ్యాచ్‌ అనంతరం పంత్‌ మాట్లాడుతూ.. ‘ఏం చెప్పాలి.. ముకుల్ చౌద‌రీ గురించి మాట‌లు రావ‌డం లేదు. నేను అత‌న్ని తొలిసారి నెట్స్‌లో చూసిన‌ప్పుడే భ‌విష్య‌త్తులో మంచి బ్యాట‌ర్ అవుతాడ‌ని ఊహించాను. ఇవాళ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్ దానిని నిజం చేసి చూపెట్టాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌ను కళ్ల ప్పగించి చూస్తూ ఉండిపోయాను. 

అనామక ఆటగాళ్లకు ఐపీఎల్ వెలుగునిచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలో ముకుల్‌చౌద‌రీ కూడా చేరిపోయాడు. ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. ఇలాంటి ప్రతి మ్యాచ్ కూడా జట్టులో ఏదో ఒక గొప్ప విషయం నిర్మితమవుతోందనే సంకేతాన్ని ఇస్తోంది. 

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముకుల్‌ చౌదరీ మూడు బంతులు వరుసగా మిస్‌ చేశాడు. ఆ సమయంలో అతడి దగ్గరకి వెళ్లి కంగారు పడొద్దు.. భవిష్యత్తులో నీకు అవకాశాలు బాగా వస్తాయి అని చెప్పాను. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్‌కు ఆ అవకాశం రానే వచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కడదాకా నిలిచి ఒంటిచేత్తో గెలిపించాడు. 

ఒక కెప్టెన్‌గా ఇంతకన్నా నాకేం కావాలి చెప్పండి.బదోని ఇప్పుడు మా జట్టులో సీనియర్ ప్లేయర్. అతనికి మేం ఇచ్చిన బాధ్యత అది. బదోని నుంచి మేం ఆశించే సహకారం ఇదే. షమీ కుర్రాడు కాదు. కానీ అతను జట్టుకు ఇచ్చే అనుభవం వెలకట్టలేనిది. అనుభ‌వ‌జ్ఞుడైన ఆట‌గాడు జట్టులో ఉండటం అద్భుతం. బౌలింగ్ యూనిట్ అంతా బాగా రాణిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ‘సైందవుడిలా అడ్డుపడి కొంపముంచాడు’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement