T20 WC 2026: వెలుగులోకి సంచలన విషయం | Lawrence Bishnoi Involvement In Canada Match Fixing In T20 WC: Report | Sakshi
Sakshi News home page

T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. మరో సంచలన వార్త

Apr 18 2026 1:52 PM | Updated on Apr 18 2026 3:37 PM

Lawrence Bishnoi Involvement In Canada Match Fixing In T20 WC: Report

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో పంజాబీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగాఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య  భారత్‌- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇలా
ఈ మెగా ఈవెంట్లో కెనడా.. న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో కలిసి గ్రూప్‌-డి నుంచి పోటీపడింది. ఒక్క విజయం కూడా నమోదు చేయలేక చెత్త ప్రదర్శనతో వెనుదిరిగింది. అయితే, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం కెనడా మెరుగ్గా ఆడింది.

అనూహ్య నిర్ణయం
చెన్నైలో కివీస్‌తో తలపడ్డ కెనడా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా అద్భుత సెంచరీ (65 బంతుల్లో 110) కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఆదిలో తడబడగా.. కెనడా కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

రెగ్యులర్‌ బౌలర్‌ కానప్పటికీ తానే స్వయంగా పవర్‌ ప్లేలో బంతితో రంగంలోకి దిగాడు బజ్వా. మొత్తంగా రెండు ఓవర్లలో 26 రన్స్‌ ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. బ్యాటర్‌గానూ అతడు విఫలమయ్యాడు. 39 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులే చేశాడు.

ఈ నేపథ్యంలో దిల్‌ప్రీత్‌ బజ్వా వ్యవహారశైలిని ఉటంకిస్తూ ‘ది ఫిఫ్త్‌ స్టేట్‌’ అనే కెనడా ఇన్వెస్టిగేటివ్‌ డాక్యుమెంటరీ ప్రోగ్రామ్‌లో అతడిపై ఆరోపణలు చేసింది. ‘అవినీతి.. నేరం.. క్రికెట్‌’ అనే డాక్యుమెంటరీలో కెనడా క్రికెట్‌ బోర్డు, కెప్టెన్‌ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది.

రంగంలోకి ఐసీసీ.. విచారణకు ఆదేశం
ఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘అవినీతి.. నేరం.. క్రికెట్‌’ డాక్యుమెంటరీ ద్వారా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌ సభ్యులు కెనడా బోర్డును బెదిరించినట్లు తెలుస్తోంది.

లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌ బెదిరింపులు
డాక్యుమెంటరీలో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘మా ఆదేశాలను పాటించకపోతే మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడతారు. నేను చెప్పిన ఆటగాళ్లను జట్టు నుంచి అస్సలు తప్పించకూడదు. ఒకవేళ అలా చేశారంటే మీకు చిక్కులు తప్పవు’’ అని లారెన్స్‌ బిష్ణోయి బెదిరింపులుకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

ఈ విషయం గురించి క్రికెట్‌ కెనడా సన్నిహిత వర్గాలు CBCతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటనలు జరిగినపుడు క్రికెటర్లు కూడా భయపడతారు. వాళ్లేమీ ఇందుకు అతీతులు కాదు. వాళ్లు చాలా భయపడిపోయారు. అందుకే ఈ విషయం గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు’’ అని పేర్కొన్నాయి.

సీనియర్లు ఉండగా అతడికే ఎందుకు కెప్టెన్సీ?
కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్‌ బజ్వాపై అనుమానాలు బలపడుతున్నాయి. సీనియర్లు ఉండగా బోర్డు 23 ఏళ్ల ఈ ఆటగాడిని.. అది కూడా టోర్నీకి దాదాపు వారం రోజుల ముందు సారథిగా నియమించడం సందేహాలకు తావిచ్చింది.

అయితే, బయటి వ్యక్తుల ఆదేశాలతోనే అతడు ఫిక్సింగ్‌కు పాల్పడి ఉంటాడని సదరు వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను కెనడా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.

చదవండి: అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్‌ అలీ

Advertisement
 
Advertisement
Advertisement