‘భారత్‌లోనే ప్రమాదకర బ్యాటర్‌.. ఈ మ్యాచ్‌తో నిరూపించాడు’ | Langers Scariest batter in India prophecy on Mukul Choudhary comes true | Sakshi
Sakshi News home page

‘భారత్‌లోనే ప్రమాదకర బ్యాటర్‌.. ఈ మ్యాచ్‌తో నిరూపించాడు’

Apr 10 2026 11:50 AM | Updated on Apr 10 2026 12:32 PM

Langers Scariest batter in India prophecy on Mukul Choudhary comes true

ముకుల్‌ చౌదరి.. ఒక్క మ్యాచ్‌తో భారత క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయిందీ పేరు. ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో గురువారం నాటి పోరులో.. ఈ లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు అవసరం కాగా... ఇందులో 54 తానొక్కడే చేశాడు.

27 బంతుల్లో
కోల్‌కతా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ముకుల్‌ చౌదరి.. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా లక్నోను విజయతీరాలకు చేర్చి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో లక్నో హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ముకుల్‌ చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా.. ‘‘వచ్చే నాలుగు నెలల్లో ఇండియాలోనే ఆరు లేదంటే ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ముకుల్‌ ఎదగడం ఖాయం’’ అని లాంగర్‌ అన్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాతో మ్యాచ్‌ సందర్భంగా ముకుల్‌ గురించి లాంగర్‌ చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఎవరీ ముకుల్‌ చౌదరి?
రాజస్తాన్‌కు చెందిన 21 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముకుల్‌ చౌదరి జైపూర్‌ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్‌ బౌలర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్‌ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు దృష్టి సారించాడు. అండర్‌–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.

ఇక దేశీ టీ20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్‌లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లాంగర్‌ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించగా... ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్‌ దానిని నిరూపించడం విశేషం. 

చదవండి: Yuvraj Singh: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement