ముకుల్‌ సిక్సర్ల మోత | Lucknow Supergiants defeated Kolkata Knight Riders by 3 wickets | Sakshi
Sakshi News home page

ముకుల్‌ సిక్సర్ల మోత

Apr 10 2026 4:18 AM | Updated on Apr 10 2026 4:20 AM

Lucknow Supergiants defeated Kolkata Knight Riders by 3 wickets

27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌ సంచలన విజయం

3 వికెట్లతో ఓడిన కోల్‌కతా

182 పరుగుల ఛేదనలో 6 వికెట్లు కోల్పోయి ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగ్గా... లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు కావాలి. ఈ దశలో కోల్‌కతా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ యువ ఆటగాడు ముకుల్‌ చౌదరీ భిన్నంగా ఆలోచించాడు. చివరి మూడు ఓవర్లలో రెండేసి సిక్సర్లతో చెలరేగిపోయి కేకేఆర్‌ పని పట్టాడు.

57లో తానొక్కడే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి లక్నోకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి 4 ఓవర్లలో వరుసగా 11, 13, 16, 14 పరుగులు రాబట్టి సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ గెలుచుకుంది. సొంత మైదానంలో విజయానికి చేరువగా వచ్చిన కోల్‌కతా మరో ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది.  

కోల్‌కతా: ఐపీఎల్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పైచేయి సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రఘువంశీ (33 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజింక్య రహానే (24 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రావ్‌మన్‌ పావెల్‌ (24 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామెరాన్‌ గ్రీన్‌ (24 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. 

రెండో వికెట్‌కు రహానే, రఘువంశీ 52 బంతుల్లో 84 పరుగులు చేయగా... ఐదో వికెట్‌కు గ్రీన్, పావెల్‌ 40 బంతుల్లో అభేద్యంగా 70 పరుగులు జోడించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ముకుల్‌ చౌదరీ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఆయుశ్‌ బదోని (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధసెంచరీ సాధించాడు.  

బ్యాటింగ్‌ తడబాటు... 
ప్రిన్స్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఫిన్‌ అలెన్‌ (8) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌండరీ వద్ద రాఠీ పట్టిన ఈ క్యాచ్‌ చర్చకు దారి తీసింది. క్యాచ్‌ పట్టే సమయంలో అతని కాలు తగిలి కుషన్‌ స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తున్నా... మూడో అంపైర్‌ వేర్వేరు కోణాల్లో పరీక్షించకుండానే అలెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు! ఈ దశలో రఘువంశీ, రహానే కలిసి కీలక పరుగులు జోడించారు. 

అయితే లక్నో బౌలర్లు చెలరేగడంతో ఒక్కసారిగా కోల్‌కతా జోరు తగ్గింది. 19 బంతుల వ్యవధిలో 12 పరుగులు మాత్రమే చేసి జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు బౌండరీనే రాలేదు! ఇలాంటి స్థితిలో గ్రీన్, పావెల్‌ దూకుడుగా ఆడారు. చివరి 4 ఓవర్లలో కేకేఆర్‌ 54 పరుగులు రాబట్టింది.  

బదోని అర్ధ సెంచరీ... 
ఛేదనలో మార్క్‌రమ్‌ (22), మార్ష్(15) తొలి వికెట్‌కు 25 బంతుల్లో 41 పరుగులు జోడించి లక్నోకు మెరుగైన ఆరంభం అందించారు. సైనీ ఓవర్లో మార్క్‌రమ్‌ వరుసగా 4, 6, 4తో ధాటిని ప్రదర్శించాడు. అయితే అరోరా ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపి దెబ్బ కొట్టగా... ఎట్టకేలకు ఈ సీజన్‌లో బౌలింగ్‌కు దిగిన గ్రీన్‌ తన తొలి ఓవర్లోనే పంత్‌ (10)ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత పూరన్‌ (13), సమద్‌ (2) విఫలం కాగా, బదోని కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. బదోని అవుటైన తర్వాత లక్నో దాదాపు ఆశలు కోల్పోగా... ముకుల్‌ అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించాడు.  

రాజస్తాన్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముకుల్‌ చౌదరీ జైపూర్‌ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్‌బౌలర్‌గా మొదలు పెట్టినా...అకాడమీలో వికెట్‌ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు మళ్లాడు. అండర్‌–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. 

ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్‌లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లక్నో కోచ్‌ లాంగర్‌ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్‌ దానిని నిరూపించాడు.  

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ X  బెంగళూరు 
వేదిక: గువాహటి
రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

స్కోరు వివరాలు  
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) షమీ (బి) రాఠీ 41; అలెన్‌ (సి) రాఠీ (బి) ప్రిన్స్‌ 9; రఘువంశీ (సి) మార్క్‌రమ్‌ (బి) సిద్ధార్థ్‌ 45; గ్రీన్‌ (నాటౌట్‌) 32; రింకూ (బి) అవేశ్‌ 4; పావెల్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–15, 2–99, 3–105, 4–111. బౌలింగ్‌: షమీ 4–0–27–0, ప్రిన్స్‌ యాదవ్‌ 4–0–47–1, సిద్ధార్థ్‌ 4–0–34–1, దిగ్వేశ్‌ రాఠీ 4–0–25–1, అవేశ్‌ 4–0–44–1. 

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్(సి) రఘువంశీ (బి) అరోరా 15; మార్క్‌రమ్‌ (సి) పావెల్‌ (బి) అరోరా 22; పంత్‌ (సి) త్యాగి (బి) గ్రీన్‌ 10; బదోని (సి) రింకూ (బి) రాయ్‌ 54; పూరన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) త్యాగి 13; సమద్‌ (బి) రాయ్‌ 2; ముకుల్‌ (నాటౌట్‌) 54; షమీ (సి) రాయ్‌ (బి) నరైన్‌ 1; అవేశ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–41, 2–42, 3–73, 4–95, 5–104, 6–125, 7–128. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–38–2, రాయ్‌ 4–0–32–2, సైనీ 3–0–37–0, నరైన్‌ 4–0–13–1, త్యాగి 3–0–31–1, గ్రీన్‌ 2–0–28–1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement