ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్‌: కేన్‌ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్‌ | Sakshi
Sakshi News home page

Kavya Maran- SRH: కేన్‌ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్‌

Published Fri, May 17 2024 10:46 AM

కేన్‌ మామతో కావ్యా మారన్‌ (PC: SRH X)

ఐపీఎల్‌- 2021, 2022, 2023లో పాయింట్ల పట్టికలో వరుసగా 8, 8, 10వ స్థానాలు.. పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలపాలైన జట్టు.. అయితే, ఈ ఏడాది ఆ జట్టు రాత పూర్తిగా మారింది.

కొత్త కెప్టెన్‌ వచ్చాడు... అదిరిపోయే ఓపెనింగ్‌ కాంబినేషన్‌ కుదిరింది. మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లోనూ మెరుపులు మెరిపించగల ఆటగాళ్లు.. వీరికి తోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు.. 

వెరసి లీగ్‌ దశలో మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత. అర్థమైంది కదా! అవును ఆరెంజ్‌ ఆర్మీ గురించే ఇదంతా! సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరిసారిగా 2020లో టాప్‌-4లో అడుగుపెట్టింది. ఇదిగో మళ్లీ ఇప్పుడే ఈ ఘనత సాధించడం. 

వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో అభిషేక్‌ శర్మ- ట్రావిస్‌ హెడ్‌ ఓపెనింగ్‌ జోడీకి తోడు హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ చెలరేగడం.. అవసరమైన సమయంలో నితీశ్‌కుమార్‌ రెడ్డి, షాబాజ్‌ అహ్మద్‌, అబ్దుల్‌ సమద్‌.. కమిన్స్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ మార్కండే  రాణించడం జట్టుకు సానుకూలాంశాలుగా మారాయి.

సమిష్టి కృషితో టాప్‌-4 వరకు
ఈ క్రమంలో విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిపోయిన సన్‌రైజర్స్‌.. ఈసారి ప్లే ఆఫ్స్‌ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్‌-4 వరకు చేరింది సన్‌రైజర్స్‌.

గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌ రద్దైన నేపథ్యంలో నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. నిజానికి ఫామ్‌ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ గెలిచేదే! కానీ వర్షం కారణంగా ఇలా పెద్దగా కష్టపడకుండానే అర్హత సాధించింది.

పట్టరాని సంతోషంలో కావ్యా మారన్‌
దీంతో ఆరెంజ్‌ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్‌ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐపీఎల్‌-2024 వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఇలా ఫలితాలు ఇస్తుండటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు.

కేన్‌ మామను హత్తుకున్న సన్‌రైజర్స్‌ ఓనర్‌
ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్‌కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు.  అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అతడు మరెవరో కాదు గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌. అదేనండీ ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్‌ మామగా పిలుచుకునే న్యూజిలాండ్‌ కెప్టెన్‌. 2021, 2022లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు విలియమ్సన్‌. 

పాత ఓనర్‌ను కలుసుకుని
అయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్‌ చేయగా.. 2023 వేలంలో గుజరాత్‌ కొనుక్కుంది. ఇప్పుడిలా తన పాత జట్టు.. ప్రస్తుత జట్టుతో మ్యాచ్‌ రద్దు కావడం వల్ల ప్లే ఆఫ్స్‌ చేరడం... ఆ సమయంలో పాత ఓనర్‌ను విలియమ్సన్‌ కలుసుకోవడం విశేషంగా నిలిచింది. 

చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్‌ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్‌ ఫైర్‌

 

Advertisement
 
Advertisement
 
Advertisement