దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ అద్భుత సెంచరీతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన వెటరన్ కరుణ్ నాయర్.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈ క్రమంలో శిమొగా వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాయర్ శతక్కొట్టాడు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను నాయర్ తన సెంచరీతో ఆదుకున్నాడు. తొలుత అభినవ్ మనోహర్‌తో భాగస్వామ్యం నెలకొల్పిన నాయర్.. తర్వాత శ్రేయస్ గోపాల్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
కరుణ్ ప్రస్తుతం 129 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లు ముగిసే సరికి కర్ణాటక 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
నాయర్ మళ్లీ వస్తాడా?
కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ గడ్డపై తనను లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. భారత బ్యాటర్లు సెంచరీల మోత మ్రోగించిన చోట.. నాయర్ కనీసం ఒక్కసారి కూడా మూడెంకెల స్కోర్ సాధించకపోవడం సెలక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది.
దీంతో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్‌కు అవకాశమిచ్చారు. ఇప్పుడు మళ్లీ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో నాయర్‌ను సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.
చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్


