
వెస్టిండీస్‌ను గెలిపించిన హోల్డర్
రెండో టి20లో పాకిస్తాన్ పరాజయం
1–1తో సిరీస్ సమం
ఫ్లోరిడా: చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో పాకిస్తాన్‌పై వెస్టిండీస్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి బంతికి మూడు పరుగులు చేస్తే విజయం సాధించాల్సిన తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల్లో పేస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ఫోర్ కొట్టి విండీస్‌ను గెలిపించాడు. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. హసన్ నవాజ్ (23 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు), కెప్టెన్ సల్మాన్ ఆఘా (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సయీమ్ అయూబ్ (7), సాహిబ్‌జాదా ఫర్హాన్ (3), మొహమ్మద్ హరీస్ (4), మొహమ్మద్ నవాజ్ (2), ఫహీమ్ అష్రఫ్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి విజయం సాధించింది.
ఇటీవల సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓడిన కరీబియన్లు... ఈ సిరీస్‌లో సైతం తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. గుడకేశ్ మోతీ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ షై హోప్ (30 బంతుల్లో 21; 2 ఫోర్లు) కాస్త పోరాడారు. విండీస్ విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెఫర్డ్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్ (10 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు విన్నింగ్ రన్స్ చేసిన హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈరోజు తెల్లవారుజామున జరుగుతుంది.