మాడ్రిడ్: పురుషుల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ అద్భుతం చేశాడు. గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించాడు. గ్రాండ్‌స్లామ్ తర్వాత అగ్రశ్రేణి టోర్నీలుగా పరిగణించే ‘మాస్టర్స్’ సిరీస్‌లో సినెర్ వరుసగా ఐదో టైటిల్ గెలిచాడు.
ఆదివారం ముగిసిన మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో సినెర్ విజేతగా నిలిచాడు. ప్రపంచ 3వ ర్యాంకర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన ఫైనల్లో సినెర్ 6–1, 6–2తో అలవోకగా విజయం సాధించాడు.
తద్వారా 36 ఏళ్ల చరిత్ర కలిగిన మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో వరుసగా ఐదు టైటిల్స్ గెలిచిన తొలి ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో మూడుసార్లు జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఒకసారి వరుసగా నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించారు.
గత ఏడాది పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన సినెర్... ఈ ఏడాది మోంటెకార్లో, మయామి, ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. చాంపియన్ సినెర్‌కు 10,07,165 యూరోల (రూ. 11 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


