
మహిళల క్రికెట్‌లో ఐర్లాండ్ జట్టు తమకంటే మెరుగైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ పాక్‌ను 11 పరుగుల తేడాతో ఓడించింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది.
పాక్ పేసర్ (కెప్టెన్) ఫాతిమా సనా 4 వికెట్లు తీసి ఐర్లాండ్ పతనాన్ని శాశించింది. సదియా ఇక్బాల్, డయానా బేగ్, రమీన్ షమీమ్, నష్రా సంధు తలో వికెట్ తీశారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యామీ హంటర్ (37) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (29), లయా పాల్ (28) నామమాత్రపు స్కోర్లు చేశారు. కెప్టెన్ గాబీ లెవిస్ (1) నిరాశపరిచింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 131 పరుగులకే చాపచుట్టేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ అంతా విఫలం కాగా.. లోయర్ ఆర్డర్ ప్లేయర్లు నతాలియా పర్వేజ్ (29), ఫాతిమా సనా (14), రమీన్ షమీమ్ (27) తమ జట్టును గెలిపించేందుకు పోరాడారు.
ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్ 3, జేన్ మగూర్ 2, ఆవా కాన్నింగ్, కారా ముర్రే, లారా మెక్‌బ్రైడ్ తలో వికెట్ తీశారు. వీరిలో కాన్నింగ్ అత్యంత పొదుపుగా (4-1-9-1) బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేసింది. ఈ సిరీస్‌లోని రెండో టీ20 బెల్‌ఫాస్ట్ వేదికగా ఆగస్ట్ 8న జరుగనుంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.