ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీమిండియా స్టార్లుగా చెలామణి అవుతున్న రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సహా ఎందరో క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఐపీఎల్లే అనడంలో సందేహం లేదు.
2008 నుంచి 18 సీజన్ల పాటు నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. గత సీజన్‌లో బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్‌లోకి వచ్చి చేరింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్‌లోనూ అలా రాణించగల సమర్థులెవరన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.
జూనియర్ మిల్లర్
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ తరహా బ్యాటింగ్ శైలిని పోలి ఉండే 20 ఏళ్ల అమేథీ కుర్రాడు ప్రశాంత్ వీర్‌పై ఈ సీజన్‌లో భారీ అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా ఆశించినంతంగా ఫలితాలు రాకపోవడంతో జట్టులో యువ ఆటగాళ్లను నింపేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలోనే వేలంలో ప్రశాంత్ వీర్‌ను ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. దేశవాలీ క్రికెట్‌లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ వీర్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. ఆ టోర్నీలో 320 పరుగులు చేయడంతో 8 వికెట్లు పడగొట్టాడు.
రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్ కావడంతో జడ్డూ స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్‌కే భారీ ఆశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్ అంచనాలను అందుకుంటాడా అన్నది చూడాలి.
సిక్సర్లకు పెట్టింది పేరు..
చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడనున్న మరో విధ్వంసక వీరుడు కార్తిక్ శర్మ. రాజస్థాన్‌కు చెందిన కార్తిక్ శర్మ అవలీలగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే వేలంలో సీఎస్‌కే ఇతడిని రూ. 14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్‌హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో కార్తిక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.
ఇక వేలంలో కార్తిక్ శర్మ కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటేనే మనోడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్స్‌లు కొట్టిన కార్తీక్ చెన్నై జట్టుకు కీలక బ్యాటర్‌గా మారే అవకాశముంది.
ఢిల్లీ ఆశాకిరణం..
ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్‌లో బాగా వినిపిస్తున్న పేరు అకిబ్ నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది.
ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆకిబ్ నబీ టైటిల్ అందిస్తాడేమో చూడాలి. ఒకవేళ నబీ ఆ ఫీట్‌ను సాధిస్తే మాత్రం టీమిండియాలోకి పిలుపు రావడం లాంఛనమే అవుతుంది.
ఆ కొరత తీరినట్లే!
భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి అదరగొడుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.
యూపీ టీ20 లీగ్‌లో అతడు పది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ సత్తాచాటితే టీమ్‌ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికేసినట్లే.
దంచుడే లక్ష్యంగా..
ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడబోతున్న తేజస్వీ దహియా కూడా విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు బరిలోకి దిగిందే తడవు దంచుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం అతడి నైజం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్‌లో తేజస్వీ దహియా 10 ఇన్నింగ్స్‌ల్లో 190 సగటుతో 339 రన్స్ సాధించాడు.
ఆ సీజన్‌లో దహియా 29 సిక్స్‌లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. కీపర్‌గాను అద రగొడుతున్నాడు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు ఈసారి ఐపీఎల్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
చదవండి: ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం!


