ఐపీఎల్ అభిమానులకు సీఎస్‌కే యాజమాన్యం షాకింగ్ వార్త చెప్పింది. సీఎస్‌కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. చెన్నై యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ వార్త ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చెన్నై యాజమాన్యం వివరాల ప్రకారం.. ‘ధోనీ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతను ప్రస్తుతం రీహాలిటేషన్ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో రెండు వారాల పాటు ఐపీఎల్ 19వ సీజన్‌కు దూరమయ్యే అవకాశముంది. ‘తలా’ తొందరగా కోలుకోవాలి!’ అని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. దీంతో సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు పెద్ద పరీక్షను ఎదుర్కొనాల్సి వస్తోంది.
అయితే ధోని ఆడకపోయినప్పటికీ సీఎస్‌కేకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు, మూడు సీజన్లుగా ధోని జట్టులో పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఎక్కువగా లోయర్ ఆర్డర్‌లోనే వస్తున్న ధోని ఫీల్డింగ్‌లో మాత్రం తన మాస్టర్‌మైండ్‌కు పని చెబుతున్నాడు.
కెప్టెన్‌కు విలువైన సలహాలు, సూచనలు చేస్తూ మార్గదర్శకుడి పాత్రకు ధోని మారిపోయాడు. 2023లో చివరిసారి ధోని సారథ్యంలోనే చెన్నై సూపర్‌కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకుంది. ప్రస్తుత సీజన్ ధోనికి ఆఖరిదని ప్రచారం జరుగుతున్న వేళ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్‌కే ఆరోసారి టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని భావిస్తోంది.
ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు సీఎస్‌కే జట్టులో భారీ మార్పులు చేసింది. ‘డాడీస్ ఆర్మీగా’ పేరు పొందిన సీఎస్‌కే మినీ వేలంలో యువ ఆటగాళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత చూపింది. కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి అన్‌క్యాప్ ప్లేయర్లను చెరో 14.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
ఇక ట్రేడింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శామ్సన్‌ను దక్కించుకున్న సీఎస్‌కే జడేజా, సామ్ కరన్‌లను వదిలేసింది. మొత్తంగా ఈసారి సరికొత్తగా కనిపిస్తున్న సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.
చదవండి: అభిమానులకు గుడ్‌న్యూస్!
Official Statement
MS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.
Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026


