
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అతి సమీపంలో ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ముందు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో లక్నో (మే 9), సన్‌రైజర్స్ (మే 13), కేకేఆర్‌లతో (మే 17) తలపడనుంది.
కాగా, ఆర్సీబీకి సీఎస్‌కేతో ఆడిన గత మ్యాచ్‌లో ఓ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వన్‌డౌన్ ఆటగాడు, ఇన్‌ఫామ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ గాయపడ్డాడు. తాజాగా ఆర్సీబీ యాజమాన్యం పడిక్కల్ స్థానాన్ని భర్తీ చేసింది. పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. మయాంక్‌ను ఆర్సీబీ కోటి రూపాయలకు దక్కించుకుంది.
34 ఏళ్ల మయాంక్‌కు ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2011 నుంచి అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 127 మ్యాచ్‌లు ఆడి 2661 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్‌లో మయాంక్ సన్‌రైజర్స్‌లో ఉన్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో మయాంక్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
తమ తొలి టైటిల్ వేటను విజయవంతంగా సాగిస్తున్న ఆర్సీబీకి మున్ముందు ఆడబోయే కీలక మ్యాచ్‌ల్లో మయాంక్ ఏ మేరకు తోడ్పడతాడో చూడాలి. మయాంక్‌కు గతంలో (2011) ఆర్సీబీకి ఆడిన అనుభవం ఉంది. మయాంక్ స్వస్థలం బెంగళూరే కావడం అతనికి కలిసొచ్చే అంశం. మయాంక్ దేవ్ స్థానాన్ని భర్తీ చేయగలడో లేదో చూడాలి. దేవ్ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 247 పరుగులు చేశాడు.
హ్యారీ బ్రూక్‌కు ప్రత్యామ్నాయంగా అటల్
లీగ్ ప్రారంభానికి ముందు వైదొలిగిన హ్యారీ బ్రూక్ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు సెదిఖుల్లా అటల్‌తో భర్తీ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతుంది.