IPL 2023: Sanju Samson's post for Shikhar after RR vs PBKS goes viral - Sakshi
Sakshi News home page

Sanju Samson- Shikhar Dhawan: అన్నా.. ప్రతిసారీ గిట్లనే అయితాంది.. ఎందుకంటావ్‌?! సంజూ ట్వీట్‌ వైరల్‌

Published Thu, Apr 6 2023 2:49 PM

IPL 2023: Sanju Samson Paaji Har Baar Itne Tight Matches Kyun Tweet Viral - Sakshi

IPL 2023- RR Vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమి నేపథ్యంలో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. సంజూతో పాటు శిఖర్‌ ధావన్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్‌-2023లో భాగంగా రాజస్తాన్‌- పంజాబ్‌ అసోంలోని గువాహటి వేదికగా బుధవారం తలపడ్డాయి.

పంజాబ్‌ ఓపెనర్లు సూపర్‌ హిట్‌
రాయల్స్‌కు హోం గ్రౌండ్‌ అయిన బర్సపరా స్టేడియంలో టాస్‌ గెలిచిన సంజూ.. తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌(60), కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మిగిలిన వాళ్లలో జితేశ్‌ శర్మ(27) ఒక్కడు 20 పరుగుల మార్కు దాటాడు.

ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పంజాబ్‌ 197 పరుగులు చేసింది. ఇక ఫీల్డింగ్‌ సమయంలో రాజస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ వేలికి గాయం కావడంతో.. యశస్వి జైశ్వాల్‌(11)కు జతగా ఓపెనింగ్‌కు దిగిన అశ్విన్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన బట్లర్‌ సైతం తక్కువ స్కోరుకే పరిమితం కాగా కెప్టెన్‌ సంజూ 25 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు.

ఆశలు పెంచిన హెట్‌మెయిర్‌, ధ్రువ్‌.. కానీ
పడిక్కల్‌ 21 , రియాన్‌ పరాగ్‌ 20 పరుగులు చేయగా.. ఆఖర్లో షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(18 బంతుల్లో 36 పరుగులు), ధ్రువ్‌ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరి పోరాటంతో గెలుపు అంచుల వరకు వచ్చిన రాజస్తాన్‌ ఆఖరికి ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలిచే మ్యాచ్‌లో పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో సంజూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు. పంజాబ్‌ కెప్టెన్‌, టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో ఉన్న ఫొటోను పంచుకున్న ఈ కేరళ బ్యాటర్‌.. ‘‘పాజీ(అన్నా).. మన మధ్య ప్రతిసారీ ఇలాంటి ఉత్కంఠ రేపే మ్యాచ్‌లే ఎందుకు జరుగుతాయంటావు?’’ అని చమత్కరించాడు.

ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఆటగాళ్ల ప్రేమాభిమానాలు, క్రీడాస్ఫూర్తి ఇలా శాశ్వతం’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు రాజస్తాన్‌- పంజాబ్‌ ఐపీఎల్‌లో 25 మ్యాచ్‌లలో తలపడగా.. రాయల్స్‌ 14, కింగ్స్‌ 11 మ్యాచ్‌లలో గెలిచాయి.

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు
తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్‌

Advertisement
Advertisement