కేవలం ఆ ఒక్క కారణం వల్ల ఆర్సీబీని వీడాలనుకోలేదు: కోహ్లి

IPL 2021 Virat Kohli Says Never Thought Leave RCB For This Reason - Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభమైన నాటి నుంచి రాయల్స్‌ చాలెంజర్స్‌ తరఫునే ఆడుతున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ప్రస్తుతం అతడు సారథ్యం వహిస్తున్న ఆర్సీబీ మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిందే తప్ప ఒక్కసారి కూడా ఐపీఎల్‌ విజేతగా నిలవలేదు. కోహ్లి సహా క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేక చతికిలపడింది. గతేడాది ప్లే ఆఫ్‌నకు అర్హత సాధించిన ఆర్సీబీ, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. అయితే, ఈసారి కప్‌ కొట్టాలన్న కసి మీద కోహ్లి సేన, డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఆడనున్న తొలి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీతో తనకున్న అనుబంధం గురించి కోహ్లి మాట్లాడుతూ... ‘‘ఇరు జట్లకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేటి మ్యాచ్‌లో మాకు కచ్చితంగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. జట్టుగా ప్రతిసారి మేం మనసు పెట్టి ఆడుతున్నాం. ఇంతవరకు ఎక్కడా రాజీపడలేదు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే కృషి చేశాం. నిబద్ధతగా ఆడుతూనే ఉన్నాం. అయితే, ఇంతవరకు మేం ఇంతవరకు ఒక్క టైటిల్‌ కూడా సాధించలేదన్న కారణంగా నేను ఆర్సీబీని వీడిపోవాలని అనుకోలేదు. గెలుపోటములు సహజం. 

నిజానికి నాపై వాళ్లు ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. ఫ్రాంఛైజీని వీడేలా మాట్లాడలేదు కూడా. మా మధ్య అసలు అలాంటి సంభాషణే జరుగలేదు.  నాకు ఇక్కడ ఉన్నంత సౌలభ్యం మరెక్కడా ఉండదని చెప్పగలను. ఆర్సీబీతో అనుబంధం అద్భుతం’’ అని చెప్పుకొచ్చాడు. ఇక గత కొన్నిరోజులుగా టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నామన్న కోహ్లి.. ఆ ఫాం ఇక్కడ పనికివస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా 2013లో కోహ్లి ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు.

చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. గెలుపు మాదే!
గా ముంబైల అందరు బ్యాట్స్‌మెన్లే.. ఎందర్నని ఔట్‌ జేయాల్రా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top