వైభవ్‌కు చాన్స్‌ దక్కేనా! | Indias second T20 against England today | Sakshi
Sakshi News home page

వైభవ్‌కు చాన్స్‌ దక్కేనా!

Jul 4 2026 3:26 AM | Updated on Jul 4 2026 3:26 AM

Indias second T20 against England today

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టి20 

బ్యాటింగ్‌పై టీమిండియా దృష్టి

రాత్రి 7 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్స్‌లో, జియో హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం  

మాంచెస్టర్‌: ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌ పర్యటనలో ఇంకా గెలుపు బోణీ చేయని భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే రెండో టి20లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. వర్షంతో రద్దయిన గత మ్యాచ్‌లో భారత్‌ 189 పరుగులు చేసినా... ఇంకా అంచనాలకు తగిన రీతిలో ఆడలేదనేది వాస్తవం. ఆరంభంలో జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సామ్సన్, ఇషాన్‌ కిషన్‌ వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యారు. అయినా సరే 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రంపై భారత్‌ ఇంకా ఆలోచిస్తూనే ఉంది. 

తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చంటూ బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వైభవ్‌ విషయంలో నిర్ణయం తీసుకోలేదని అర్థమవుతోంది. అయితే నాయకుడిగా వరల్డ్‌ కప్‌ గెలిపించిన తర్వాత కూడా సూర్యకుమార్‌ యాదవ్‌ కెపె్టన్సీతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయిన స్థితిని బట్టి చూస్తే సామ్సన్‌ ఇంకా ఎంతో కాలం తన వరల్డ్‌ కప్‌ మెరుపులతోనే జట్టులో కొనసాగలేడు. కాబట్టి కచ్చితంగా బాగా ఆడాల్సిన స్థితిలో అతను నిలిచాడు. 

మరోవైపు అభిషేక్‌ శర్మ ఫామ్‌ జట్టుకు సానుకూలాంశం. ఇంగ్లండ్‌పై ఆడిన గత ఏడు మ్యాచ్‌లలో 220 స్ట్రయిక్‌రేట్‌తో అభిషేక్‌ శర్మ 3 అర్ధసెంచరీలు చేయడం ఈ జట్టుపై అతని జోరుకు ఉదాహరణ. కెపె్టన్‌ శ్రేయస్‌ అర్ధ సెంచరీ చేసినా అతని బ్యాటింగ్‌లో తగిన ధాటి కనిపించలేదు. ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత తనదంటూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడని తిలక్‌ వర్మపై రాణించాల్సిన ఒత్తిడి ఉందనేది వాస్తవం. గత మ్యాచ్‌లో ఎవరికీ బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు కాబట్టి బౌలర్ల బృందంలోనూ ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

మరోవైపు ఆర్చర్‌ రాకతో ఇంగ్లండ్‌ పేస్‌ పదును పెరిగింది. జోష్‌ టంగ్‌ కూడా ఈ మ్యాచ్‌తో టి20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. మహమూద్, ల్యూక్‌వుడ్‌ స్థానాల్లో వీరిద్దరు బరిలోకి దిగుతారు. బట్లర్, బ్రూక్, బెతెల్, జాక్స్‌లతో పదునైన బ్యాటింగ్‌ లైనప్‌ జట్టు సొంతం. ఫిల్‌ సాల్ట్‌ తన సొంత స్టేడియంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఓల్డ్‌ట్రఫోర్డ్‌ మైదానంలో అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు కూడా బాగా ప్రభావం చూపగలరు. అయితే మంచి బౌన్స్‌తో చక్కటి షాట్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. గత ఏడాది ఇక్కడి పిచ్‌పై దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో ఇంగ్లండ్‌ 300కు పైగా స్కోరు నమోదు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement