
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా గురువారం నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశి్వన్, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ప్లేయర్లు టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇది చక్కటి వేదిక కానుంది.
ఈ ఏడాది దులీప్ ట్రోఫీని పాత పద్ధతిలోనే జోన్‌ల వారిగా నిర్వహించనున్నారు. సౌత్ జోన్, వెస్ట్ జోన్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించగా... రేపటి నుంచి ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్‌తో ఈస్ట్ జోన్... సెంట్రల్ జోన్‌తో నార్త్ ఈస్ట్ జోన్ తలపడనున్నాయి.
వచ్చే నెల 15 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌ను బెంగళూరు వేదికగా నిర్వహించనున్నారు. ఇటీవల భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకోగా... తదుపరి సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారిలో శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రజత్ పాటీదార్, తనుశ్ కొటియాన్, మొహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, నిశాంత్ తదితరులు ఉన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్ దులీప్ ట్రోఫీలో సత్తా చాటి సుదీర్ఘ ఫార్మాట్‌లో అయినా టీమిండియా బెర్త్ సాధించాలని చూస్తున్నాడు.
సౌత్ జోన్ సారథిగా తిలక్...
మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు సెమీఫైనల్స్ జరగనున్నాయి. ఇక 11న ఫైనల్ ప్రారంభం కానుంది. ఆయా జోన్‌ల సెలెక్టర్లు ఇప్పటికే జట్లను ప్రకటించారు. హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... సౌత్ జోన్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.
ఇప్పటికే భారత టి20 జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న తిలక్... ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌పై దృష్టి పెడుతున్నాడు. మెరుగైన టెక్నిక్ ఉన్న ఆటగాడిగా దిగ్గజాల ప్రశంసలు అందుకున్న ఈ హైదరాబాదీ... దులీప్ ట్రోఫీలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి.
ఇక అపార నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు సాధించిన శ్రేయస్ అయ్యర్... జాతీయ జట్టులో చోటు కోసం మాత్రం తీవ్రంగా కష్టపడుతున్నాడు. స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తాతో పాటు... అవసరమైతే వేగంగా ఆడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ప్రతిభగల అయ్యర్ దులీప్ ట్రోఫీలో రాణించాలని భావిస్తున్నాడు.
అతడు చివరిసారిగా 2024లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పలువురు ప్లేయర్లను ఆరో స్థానంలో పరిశీలించినా... వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో రాణిస్తే... శ్రేయస్‌కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి.
షమీ సత్తా చాటేనా!
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... తిరిగి టెస్టు జట్టులో పునరాగమనం చేసేందుకు ప్రయతి్నస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదనే కారణంగా అతడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు.
దీంతో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడగా... మొహమ్మద్ సిరాజ్‌కు మరో ఎండ్ నుంచి నిలకడైన తోడు లభించలేదు. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో షమీ సత్తాచాటితే అతడు తిరిగి టెస్టు జట్టులోకి రావచ్చు. దీంతో అతడికి ఈ టోర్నీ కీలకం కానుంది. ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ మునుపటి వాడి ప్రదర్శిస్తే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పకపొచ్చు.
ఇక ఈస్ట్ జోన్ తరఫున ముకేశ్ కుమార్, సెంట్రల్ జోన్ తరఫున ఖలీల్ అహ్మద్ కూడా తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకుంటున్నారు. వీరితో పాటు మరికొంతమంది యువ ఆటగాళ్లు సైతం దులీప్ ట్రోఫీలో తమదైన ముద్రవేసేందుకు సిద్ధమవుతున్నారు.