
ఆసియా చాంపియన్‌షిప్ స్కీట్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన భారత షూటర్
షిమ్‌కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ సీనియర్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. బుధవారం జరిగిన పురుషుల స్కీట్ ఈవెంట్‌లో భారత షూటర్ అనంత్ జీత్ సింగ్ నరూకా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాజస్తాన్‌కు చెందిన అనంత్‌కు ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో ఇదే తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం కావడం విశేషం. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 27 ఏళ్ల అనంత్ 60 పాయింట్లకుగాను 57 పాయింట్లు స్కోరు చేసి విజేతగా అవతరించాడు.
ఆసియా క్రీడల చాంపియన్ మన్సూర్ అల్ రషీది (కువైట్) 56 పాయింట్లు సాధించి రజత పతకం నెగ్గాడు. 43 పాయింట్లతో అల్ ఇషాక్ అలీ అహ్మద్ (ఖతర్) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 46 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో అనంత్ 119 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు.క్వాలిఫయింగ్‌లో టాప్–6లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి.
2023 ఆసియా చాంపియన్‌షిప్ టీమ్ విభాగంలో, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచిన అనంత్ హాంగ్జౌ ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో రజతం సాధించాడు. మరోవైపు మహిళల స్కీట్ టీమ్ విభాగంలో భారత బృందానికి కాంస్య పతకం లభించింది. మహేశ్వరి చౌహాన్ (113 పాయింట్లు), గనీమత్ సెఖోన్ (109 పాయింట్లు), రైజా ధిల్లాన్ (107 పాయింట్లు)లతో కూడిన భారత జట్టు 329 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగంలో మహేశ్వరి చౌహాన్ 35 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
సురుచి–సౌరభ్ జోడీకి కాంస్యం
ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సురుచి సింగ్–సౌరభ్ చౌధరీ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. కాంస్య పతక మ్యాచ్‌లో సురుచి–సౌరభ్ 17–9 పాయింట్లతో లియు హెంగ్ యు–సెయి సియాంగ్ చెన్ (చైనీస్ తైపీ)లపై విజయం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో వన్షిక చౌధరీ–జొనాథన్ గావిన్ ఆంటోనీ ద్వయం భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేసింది.

ఫైనల్లో వన్షిక–జొనాథన్ 16–14తో కిమ్ యెజిన్–కిమ్ డూయోన్ (దక్షిణ కొరియా)లపై గెలుపొందింది. సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో కలిపి ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో భారత్ ఏడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి 17 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.