ఎనిమిదేళ్ల క్రితం... వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 229 పరుగుల లక్ష్య ఛేదనలో చివర్లో తడబడిన భారత మహిళలు 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లతో 14 పరుగుల చేయాల్సిన స్థితిలో అంత చేరువగా వచ్చి ఓడటం అందరినీ వేదనకు గురి చేసింది. అయితే 2017 వరల్డ్ కప్ ప్రదర్శన గతంతో పోలిస్తే మహిళల జట్టుకు ఎంతో మేలు చేసింది. అన్ని వైపుల ఆసక్తి కనిపించడంతో పాటు టీమ్ స్థాయి కూడా పెరిగింది.
ప్రతీ దశలో బీసీసీఐ అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తూ టీమ్‌కు తగిన అవకాశాలు కల్పించింది. అయినా సరే, 2021 వరల్డ్ కప్ మరోసారి నిరాశను మిగిల్చింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్‌కు కూడా చేరలేకపోయింది. దీని తర్వాత మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్‌ప్రీత్ చేతుల్లోకి వన్డే టీమ్ సారథ్య బాధ్యతలు వచ్చాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం అమోల్ మజుందార్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన తర్వాత టీమ్‌లో అసలైన మార్పు మొదలైంది.
ఆ సమయంలో వేరే ఆలోచన లేకుండా 2025 వరల్డ్ కప్ కోసమే పక్కా ప్రణాళికతో జట్టు సన్నద్ధమైంది. టోర్నీ వేదిక భారత్ కావడంతో దానికి అనుగుణంగా జట్టును తీర్చిదిద్దేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయత్నించింది. 2023లో పూర్తి స్థాయిలో వచ్చిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రభావం కూడా టీమ్‌పై కనిపించింది. ఈ లీగ్ మన ప్లేయర్లకు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడు నేర్పించింది. అప్పుడప్పుడు కొన్ని ఓటములు వచ్చినా ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో మార్పు కూడా కనిపించింది.
ప్రత్యేక శిబిరాలు, ఎక్కువ విరామం లేకుండా వరుసగా వేర్వేరు జట్లతో సిరీస్‌లు భారత్ ఆటను మరింత పదునుగా మార్చాయి. గత రెండేళ్లలో ఇది క్రమ పద్ధతిలో సాగింది. బలమైన ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్ గెలవడం టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
సరిగ్గా టోర్నీకి ముందు స్వదేశంలోనే జరిగిన సిరీస్‌లో ఆ్రస్టేలియాతో ఓడినా... మన జట్టు కూడా బలమైన ప్రదర్శనే ఇచ్చింది. ముఖ్యంగా మూడో వన్డేలో 412 పరుగుల లక్ష్య ఛేదనలో ఏకంగా 369 పరుగులు చేయగలిగింది. ఇదే మ్యాచ్ సెమీస్‌లో ఆసీస్‌పై విజయానికి స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు.
జట్టులోని ప్రతీ ఒక్కరు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 434 పరుగులతో ఎప్పటిలాగే స్మృతి జట్టు నంబర్‌వన్ బ్యాటర్‌గా తన స్థాయిని ప్రదర్శించగా, గాయంతో 7 మ్యాచ్‌లకే పరిమితమైన ప్రతీక 308 పరుగులు సాధించింది. విజయం సాధించిన తర్వాత వీల్‌చైర్‌లో కూర్చొని ఆమె సంబరాల్లో పాల్గొనడం సగటు అభిమానులందరికీ సంతృప్తినిచ్చింది. జెమీమా 292 పరుగులే చేసినా, ఆసీస్‌పై సెమీఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ను ఆమెను చిరస్థాయిగా నిలబెట్టింది.
రిచా ఘోష్ ఏకంగా 133.52 స్ట్రయిక్‌రేట్‌తో చేసిన 235 పరుగులు జట్టుకు ప్రతీసారి కావాల్సిన జోరును అందించాయి. 260 పరుగులు చేసిన హర్మన్ నాయకురాలిగా జట్టును సమర్థంగా నడిపించింది. సెమీస్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఆమె స్థాయిని చూపించింది. కెప్టెన్‌గా సాధించిన ఈ గెలుపుతో భారత క్రికెట్‌లో ఆమె దిగ్గజాల సరసన నిలిచింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 22 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా విజయంలో ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా ఫైనల్లో తీసిన ఐదు వికెట్లు ఎప్పటికీ మర్చిపోలేనివి.
బ్యాటింగ్‌లో కూడా ఆమె 3 అర్ధసెంచరీలు సాధించింది. రేణుక, క్రాంతి, అమన్‌జోత్, రాధ అంకెలపరంగా పెద్ద గణాంకాలు నమోదు చేయకపోయినా... జట్టుకు అవసరమైన ప్రతీసారి కీలక సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చారు. ఇదే జట్టును నడిపించింది. లీగ్ దశలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లాంటి చేతుల్లో ఓడి ఒక్కసారిగా జట్టు నిరాశలో కూరుకుపోయింది. అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఆట మాత్రం మారడం లేదని సూటిపోటు మాటలు వినిపించాయి. కానీ అక్కడినుంచి టీమ్ ఉవ్వెత్తున ఎగసింది. సెమీస్ స్థానం ఖాయం చేసుకోవడంతో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో అద్భుత విజయాలతో చాంపియన్‌గా నిలిచింది. ఈ అసాధారణ, అద్భుత ప్రదర్శనకు దేశం మొత్తం సలామ్ చేస్తోంది.


