Ind Vs Sl Test Series: లంకపై విజయఢంకా

India vs Sri Lanka: ndia Beat Srilanka By 238 Runs - Sakshi

రెండో టెస్టులో 238 పరుగులతో భారత్‌ జయభేరి

2–0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

సత్తా చాటిన బౌలర్లు

సెంచరీతో పోరాడిన కరుణరత్నే

11–0 ఇదీ రోహిత్‌ లెక్క! ఈ ‘హిట్‌మ్యాన్‌’ పూర్తిస్థాయి జట్టు పగ్గాలు చేపట్టాక... స్వదేశంలో ఇద్దరు ప్రత్యర్థులతో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ వైట్‌వాష్‌ చేసింది. వెస్టిండీస్‌తో మూడేసి చొప్పున టి20, వన్డేలు... తర్వాత శ్రీలంకతో మూడు టి20 పోటీలు, ఇప్పుడు రెండు సంప్రదాయ టెస్టులు అన్నింటా భారత్‌దే జయం.

పాపం కరీబియన్, లంక జట్లు కనీస విజయం లేక ‘జీరో’లతో ఇంటిబాట పట్టాయి. రెండో రోజే టెస్టులో విజయానికి బాటలు వేసుకున్న భారత్‌ సోమవారం రెండో సెషన్‌లోనే లంక ఆటను ముగించడంలో సఫలమైంది. కెప్టెన్‌ కరుణరత్నే శతకం మినహా లంక ఈ పర్యటనలో చెప్పుకునేందుకు ఏమీ లేక వెనుదిరిగింది.  

బెంగళూరు: టీమిండియా బౌలింగ్‌ ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక మూడో రోజు రెండు సెషన్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. డేనైట్‌ టెస్టులో భారత్‌ 238 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత బ్యాటర్లలాగే బౌలర్లూ శ్రీలంక భరతం పట్టారు. 3 వికెట్లు తీసిన స్టార్‌ సీమర్‌ బుమ్రా ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లను పడేశాడు. స్పిన్నర్లు అశ్విన్‌ (4/55), అక్షర్‌ పటేల్‌ (2/37) లంక బ్యాటర్స్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా తిప్పేశారు.

అయితే తొలి ఇన్నింగ్స్‌లో వంద పైచిలుకు పరుగులకే ఆపసోపాలు పడిన లంక... కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (174 బంతుల్లో 107; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీ పుణ్యమాని రెండో ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు పరుగులు చేయడమే ఆ జట్టుకు ఊరట. శ్రేయస్‌ అయ్యర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కగా... 120.12 స్ట్రైక్‌రేట్‌తో సిరీస్‌లో 185 పరుగులు చేసిన రిషభ్‌ పంత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు.  

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
మూడోరోజు 447 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు 28/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక 59.3 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెప్టెన్‌ కరుణరత్నే... ఇతనితో పాటు ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ (60 బంతుల్లో 54; 8 ఫోర్లు) ఆడినంత వరకే ఆట కనిపించింది. వీళ్లిద్దరి బౌండరీలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెండిస్‌ వన్డేలాగే ధాటైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

కెప్టెన్‌ కంటే ముందుగా 57 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ ఉన్నంతసేపు 12 ఓవర్ల పాటు బౌండరీలు, పరుగులతో స్కోరుబోర్డు కదిలింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 97 పరుగులు జతచేసింది. ఎప్పుడైతే జట్టు స్కోరు 97 వద్ద మెండిస్‌ను అశ్విన్‌ స్టంపౌట్‌ చేశాడో 9 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు పడ్డాయి. మాథ్యూస్‌ (1)ను జడేజా బౌల్డ్‌ చేయగా, ధనంజయ డిసిల్వా (4)ను అశ్విన్‌ పెవిలియన్‌ చేర్చాడు.

డిక్‌వెలా (12) విఫలమయ్యాడు. మరో వైపు కరుణరత్నే 92 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తయింది మరో వికెట్‌ పడకుండా తొలిసెషన్‌ 151/4 స్కోరు వద్ద ముగిసింది. రెండో సెషన్‌ మొదలైన కాసేపటికే డిక్‌వెలా, అనంతరం అసలంక(5) అక్షర్‌ పటేల్‌ ఉచ్చులో పడ్డారు. 166 బంతుల్లో సెంచరీ (14 ఫోర్లు) పూర్తి చేసుకున్న కరుణరత్నే అవుటయ్యాక 4 పరుగుల వ్యవధిలోనే లంక ఆలౌటైంది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలిఇన్నింగ్స్‌ 252;
శ్రీలంక తొలిఇన్నింగ్స్‌ 109;
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 303/9 డిక్లేర్డ్‌;

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: తిరిమన్నె (ఎల్బీ) (బి) బుమ్రా 0; కరుణరత్నే (బి) బుమ్రా 107; మెండిస్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 54; మాథ్యూస్‌ (బి) జడేజా 1; ధనంజయ (సి) విహారి (బి) అశ్విన్‌ 4; డిక్‌వెలా (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 12; అసలంక (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 5; ఎంబుల్డెనియా (ఎల్బీ) (బి) అశ్విన్‌ 2; లక్మల్‌ (బి) బుమ్రా 1; ఫెర్నాండో (సి) షమీ (బి) అశ్విన్‌ 2; జయవిక్రమ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (59.3 ఓవర్లలో ఆలౌట్‌) 208. వికెట్ల పతనం: 1–0, 2–97, 3–98, 4–105, 5–160, 6–180, 7–204, 8–206, 9–208, 10–208. బౌలింగ్‌: బుమ్రా 9–4–23–3, షమీ 6–0–26–0, అశ్విన్‌ 19.3–3–55–4, జడేజా 14–2–48–1, అక్షర్‌ పటేల్‌ 11–1–37–2. 
 
442: టెస్టుల్లో అశ్విన్‌ వికెట్ల సంఖ్య. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అతను...దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ (439)ను అధిగమించి ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top