0/2 నుంచి 174/2 వరకు... | India vs England 4th Test Day 4: India reach 174 for 2 at Stumps on Day 4 | Sakshi
Sakshi News home page

0/2 నుంచి 174/2 వరకు...

Jul 27 2025 1:44 AM | Updated on Jul 27 2025 1:44 AM

India vs England 4th Test Day 4: India reach 174 for 2 at Stumps on Day 4

రాహుల్, గిల్‌ అసాధారణ పోరాటం 

మరో 137 పరుగులు వెనుకంజ 

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 669 

బెన్‌ స్టోక్స్‌ సెంచరీ...  311 పరుగుల ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఏకంగా 311 పరుగుల ఆధిక్యం అప్పగించేశాం. లక్ష్యం నిర్దేశించడం సంగతి తర్వాత... ముందు ఈ లోటును ఎలా పూడ్చాలా అనే ఆందోళన... రెండో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి స్కోరు 0/2... మిగిలిన అరవైకి పైగా ఓవర్లను ఆడగలరా అనే సందేహం. నాలుగో రోజే కుప్పకూలి మ్యాచ్‌ను అప్పగించేస్తారేమో అనిపించింది. కానీ రాహుల్, గిల్‌ అసాధారణ రీతిలో గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో కాస్త తడబడ్డా ఏకాగ్రత చెదరకుండా రెండు సెషన్లు పట్టుదలగా ఆడారు. ఏకంగా 62.1 ఓవర్ల పాటు వికెట్‌ ఇవ్వకుండా రోజును ముగించారు. అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా దాటిపోలేదు. మరో 137 పరుగులు వెనుకంజలో ఉన్న జట్టు ప్రస్తుతానికి మ్యాచ్‌ను రక్షించుకునేందుకు బాటలు వేసుకుంది. ఆపై ఎన్ని పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సవాల్‌ విసరగలదా అనేది చూడాలి.

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న భారత్‌ సురక్షిత స్థితికి చేరుతోంది. మ్యాచ్‌ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), శుబ్‌మన్‌ గిల్‌ (167 బంతుల్లో 78 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ స్టోక్స్‌ (198 బంతుల్లో 141; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజాకు 4 వికెట్లు దక్కాయి.  

22.1 ఓవర్లలో 125 పరుగులు... 
నాలుగో రోజు ఇంగ్లండ్‌ మెరుపు బ్యాటింగ్‌తో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. స్టోక్స్‌ చాలా కాలం తర్వాత చెలరేగిపోగా, బ్రైడన్‌ కార్స్‌ (54 బంతుల్లో 47; 3 ఫోర్లు 2 సిక్స్‌లు), డాసన్‌ (26) అండగా నిలిచారు. ఆట ఆరంభంలోనే డాసన్‌ను బుమ్రా బౌల్డ్‌ చేసినా... స్టోక్స్, కార్స్‌ భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ దూసుకుపోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ దిశగా కొట్టిన బౌండరీతో 164 బంతుల్లో స్టోక్స్‌ సెంచరీ పూర్తయింది. రెండేళ్ల తర్వాత, 35 ఇన్నింగ్స్‌లలో స్టోక్స్‌కు ఇది తొలి శతకం కావడం విశేషం. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన స్టోక్స్‌ తర్వాతి 34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు రాబట్టడం విశేషం. మరో ఎండ్‌లో కార్స్‌ కూడా భారత బౌలర్లపై ధాటిని చూపించాడు.

తొమ్మిదో వికెట్‌కు స్టోక్స్, కార్స్‌ కేవలం 95 బంతుల్లోనే 97 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు జడేజా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి స్టోక్స్‌ వెనుదిరగ్గా... తన తర్వాతి ఓవర్లో కార్స్‌ను అవుట్‌ చేసి జడేజా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగించాడు. 2015 తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బౌలర్లు తలా 100కు పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. 

భారీ భాగస్వామ్యం... 
భారత జట్టు ఇన్నింగ్స్‌ పేలవంగా మొదలైంది. వోక్స్‌ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే వరుస బంతుల్లో జైస్వాల్‌ (0), సాయి సుదర్శన్‌ (0) వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత రాహుల్, గిల్‌ చక్కటి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. రెండో సెషన్‌లో ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్నా... ఆ తర్వాత వీరిద్దరు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూడచక్కటి షాట్లతో అలరించారు. 46 పరుగుల వద్ద గల్లీలో డాసన్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన గిల్‌ 77 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

26 ఓవర్ల రెండో సెషన్‌లో భారత్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోలేదు. టీ విరామం తర్వాత కూడా గిల్, రాహుల్‌ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. పరుగుల రాక కాస్త తగ్గినా ప్రమాదం కూడా ఏమీ కనిపించలేదు. ఒక దశలో వరుసగా 21.4 ఓవర్ల పాటు బౌండరీనే రాలేదు! 137 బంతుల్లో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్‌ బౌలర్లను మార్చి మార్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. అప్పుడప్పుడు కొన్ని చక్కటి బంతులు ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించినా భారత్‌కు నష్టం జరగలేదు.  

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 358; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) రాహుల్‌ (బి) జడేజా 84; డకెట్‌ (సి) (సబ్‌) జురేల్‌ (బి) కంబోజ్‌ 94; పోప్‌ (సి) రాహుల్‌ (బి) సుందర్‌ 71; రూట్‌ (స్టంప్డ్‌) (సబ్‌) జురేల్‌ (బి) జడేజా 150; బ్రూక్‌ (స్టంప్డ్‌) (సబ్‌) జురేల్‌ (బి) సుందర్‌ 3; స్టోక్స్‌ (సి) సుదర్శన్‌ (బి) జడేజా 141; స్మిత్‌ (సి) (సబ్‌) జురేల్‌ (బి) బుమ్రా 9; డాసన్‌ (బి) బుమ్రా 26; వోక్స్‌ (బి) సిరాజ్‌ 4; కార్స్‌ (సి) సిరాజ్‌ (బి) జడేజా 47; ఆర్చర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 38; మొత్తం (157.1 ఓవర్లలో ఆలౌట్‌) 669.
వికెట్ల పతనం: 1–166, 2–197, 3–341, 4–349, 5–499, 6–515, 7–528, 8–563, 9–658, 10–669.
బౌలింగ్‌: బుమ్రా 33–5–112–2, కంబోజ్‌ 18–1–89–1, సిరాజ్‌ 30–4–140–1, శార్దుల్‌ 11–0–55–0, జడేజా 37.1–0–143–4, సుందర్‌ 28–4–107–2.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) రూట్‌ (బి) వోక్స్‌ 0; రాహుల్‌ (బ్యాటింగ్‌) 87; సుదర్శన్‌ (సి) బ్రూక్‌ (బి) వోక్స్‌ 0; గిల్‌ (బ్యాటింగ్‌) 78; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (63 ఓవర్లలో 2 వికెట్లకు) 174. 
వికెట్ల పతనం: 1–0, 2–0. బౌలింగ్‌: వోక్స్‌ 15–3–48–2, ఆర్చర్‌ 11–2–40–0, కార్స్‌ 10–2–29–0, డాసన్‌ 22–8–36–0, రూట్‌ 5–1–17–0.

3 టెస్టుల్లో 7 వేలకు పైగా పరుగులు చేసి 200కు పైగా వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా స్టోక్స్‌ నిలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్, జాక్‌ కలిస్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు.
5 ఒకే టెస్టులో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు కూడా తీసిన ఐదో కెప్టెన్‌ స్టోక్స్‌. గతంలో అట్కిన్సన్, సోబర్స్, ముస్తాక్‌ మొహమ్మద్, ఇమ్రాన్‌ ఖాన్‌లకు మాత్రమే ఇది సాధ్యమైంది.
1 టెస్టుల్లో బుమ్రా ఒక ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులివ్వడం ఇదే మొదటి సారి. అతను తన కెరీర్‌లో 48వ టెస్టు ఆడుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement