భారత్, బంగ్లాదేశ్ చివరి లీగ్ మ్యాచ్ రద్దు
ఇరు జట్లకు చెరో పాయింట్
గురువారం రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ‘ఢీ’
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌ను వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు రద్దు కాగా... లీగ్ దశలో చివరి మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో చివరకు ఫలితం తేలకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
అయితే ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారు అయిపోవడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ముందుగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత తిరిగి వర్షం పడటంతో 27 ఓవర్లకు తగ్గించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 27 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. షర్మిన్ అక్తర్ (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... శోభన (26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది.
భారత బౌలర్లలో రాధ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర స్పిన్నర్ శ్రీచరణి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. రేణుక సింగ్, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్ కౌర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 27 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన భారత జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగుల వద్ద ఉన్న స్థితిలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో పలుమార్లు సమీక్షించిన అనంతరం అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన టీమిండియా ఓపెనర్ ప్రతీక రావల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో ఈ మ్యాచ్‌లో అమన్‌జ్యోత్ కౌర్ (15 నాటౌట్; 2 ఫోర్లు) ఓపెనర్‌గా బరిలోకి దిగింది. స్మృతి మంధాన (27 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. రెండు రోజుల విరామం తర్వాత... గువాహటిలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా... నవీముంబైలో గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడతాయి.
ఈ రెండు మ్యాచ్‌లకు వర్ష సూచన ఉంది. అయితే సెమీఫైనల్స్‌తోపాటు ఫైనల్ మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ ఉంది. ‘రిజర్వ్ డే’ రోజున కూడా వర్షంతో మ్యాచ్‌లు సాధ్యంకాకపోతే లీగ్ దశలో మెరుగైన స్థానాల్లో నిలిచిన జట్లు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫైనల్‌కు చేరుతాయి. ఫైనల్ కూడా రద్దయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
6 ప్రస్తుత ప్రపంచకప్‌లో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లు. శ్రీలంకలో జరిగిన 11 మ్యాచ్‌ల్లో ఐదు వర్షంతో రద్దయ్యాయి. తాజాగా ముంబై పోరు కూడా ఆ జాబితాలో చేరింది.


