‘పింక్‌’ పిలుపు...

India vs Australia A Pink Ball practice Match Today - Sakshi

నేటి నుంచి ఆసీస్‌ ‘ఎ’ జట్టుతో భారత్‌ రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌

గులాబీ బంతితో డే–నైట్‌ పోరు

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూరం!

ఉదయం గం. 9 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లు మొదలయ్యాక భారత జట్టు గులాబీ బంతితో ఒకే ఒక మ్యాచ్‌ (2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో) ఆడింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వచ్చే గురువారం నుంచి మరో ‘పింక్‌’ పోరులో తలపడాల్సి ఉంది. దానికి సిద్ధమయ్యేందుకు మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్‌తో పోలిస్తే పిచ్‌లో తేడా ఉన్నా... ఫ్లడ్‌లైట్లలో, పింక్‌ బాల్‌తో       ఆడటం అసలు సమరానికి ముందు సరైన సన్నాహకంగా భావించవచ్చు.   

సిడ్నీ: టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన భారత జట్టు రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తమ వనరులను మరింతగా పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా ‘ఎ’తో నేటి నుంచి జరిగే ఈ మూడు రోజుల మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మినహా భారత టెస్టు జట్టులోని రెగ్యులర్‌ ఆటగాళ్లంతా ఆడే అవకాశం ఉంది. 12 రోజుల వ్యవధిలో వన్డే, టి20 సిరీస్‌లు ఆడటంతో అలసిపోయినట్లు భావిస్తున్న కెప్టెన్‌ తొలి టెస్టుకు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్నాడు.  

బరిలోకి విహారి...
కోహ్లి జట్టులోకి రావడం మినహా ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆడే బృందమే తొలి టెస్టులోనూ బరిలోకి దిగే అవకాశం దాదాపు ఖాయమే. తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడని రెగ్యులర్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఇక్కడ తన బ్యాటింగ్‌ పదును పరీక్షించుకోవాల్సి ఉంది. రెండో ఓపెనర్‌గా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, శుబ్‌మన్‌ గిల్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుందా లేక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ప్రయత్నిస్తారా ఇక్కడ తేలిపోతుంది. పుజారా, రహానేలు మరింత ప్రాక్టీస్‌ ఆశిస్తుండగా ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారిపై కూడా అందరి దృష్టి ఉంది.

తొలి టెస్టులో భారత్‌ నలుగురు రెగ్యులర్‌ బౌలర్లతోనే ఆడాలని భావిస్తే ఆరో నంబర్‌ బ్యాట్స్‌మన్‌గా విహారికి అవకాశం దక్కుతుంది. అతనికి ఈ మ్యాచ్‌        సన్నాహకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే కుల్దీప్‌ను ఆడించాల్సి ఉంటుంది. డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో కుల్దీప్‌ వైవిధ్యమైన బౌలింగ్‌ అదనపు బలంగా మారుతుందనుకుంటే అతనికీ తగినంత ప్రాక్టీస్‌ అవసరం. ఇషాంత్‌ లేకపోవడంతో షమీ, బుమ్రాలపై మరింత బాధ్యత పెరిగింది. టి20లకు దూరంగా ఉండి వీరు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి పింక్‌ బంతితో ఆసీస్‌ పిచ్‌పై సాధ్యమైనంత ప్రాక్టీస్‌ను కోరుకుంటున్నారు. వికెట్‌ కీపర్‌గా సాహా తొలి మ్యాచ్‌లో సత్తా చాటగా... ఇప్పుడు అతడినే కొనసాగిస్తారా లేక రిషభ్‌ పంత్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తారా చూడాలి.  

సత్తా చాటేందుకు...
ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు కూడా మరీ బలహీనంగా ఏమీ లేదు. టెస్టు ఓపెనర్‌గా ఖాయమైన జో బర్న్స్‌తో పాటు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ప్రదర్శనతో టెస్టు తుది జట్టులో స్థానం ఆశిస్తున్న కామెరాన్‌ గ్రీన్, సీన్‌ అబాట్, మిషెల్‌ స్వెప్సన్‌ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా గ్రీన్‌ ఇక్కడ చెలరేగితే టెస్టు క్రికెటర్‌గా ప్రమోషన్‌ దక్కవచ్చు. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు ఆడిన నిక్‌ మ్యాడిసన్, మార్కస్‌ హారిస్‌ కూడా సొంత మైదానంలో సత్తా చాటగలరు. గాయంతో మోజెస్‌ హెన్రిక్స్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.  

ఫస్ట్‌ క్లాస్‌ హోదా ఉంటేనే...
సరిగ్గా తొలి టెస్టు ఆడే జట్టుతోనే ప్రాక్టీస్‌ చేయాలని భారత్‌ భావిస్తే (కోహ్లి మినహా) ఈ మ్యాచ్‌కు ఫస్ట్‌ క్లాస్‌ హోదా ఇవ్వాలని ఆతిథ్య బోర్డును కోరవచ్చు. అప్పుడు మ్యాచ్‌లో తీవ్రత పెరుగుతుంది. పూర్తి స్థాయిలో 11 మంది తుది జట్టునే బరిలోకి దించాల్సి ఉంటుంది.  లేదంటే మామూలు టూర్‌ మ్యాచ్‌లాగానే ఎవరైనా గరిష్టంగా 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్‌ చేస్తూ దాదాపు అందరు ఆటగాళ్లను పరీక్షించుకోవచ్చు. సాధారణంగా పర్యాటక జట్టు విజ్ఞప్తి చేస్తేనే ఆతిథ్య బోర్డు స్పందిస్తుంది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top