
రేసులో జైస్వాల్, శ్రేయస్ ప్రసిధ్, సిరాజ్ సందేహమే
ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీకి నేడు భారత జట్టు ఎంపిక
భారత జట్టు సూర్యకుమార్ యాదవ్
కెప్టెన్సీలో ఆడిన గత 20 టి20ల్లో 17 గెలిచి జోరు మీదుంది. ఈ అన్ని మ్యాచ్‌లకు వేర్వేరు కారణాలతో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ దూరమయ్యారు. మరోవైపు ఈ ఏడాది జట్టు 5 టి20లు మాత్రమే ఆడింది. నిజానికి వీటిలో ప్రదర్శనను బట్టి చూస్తే భారత జట్టులో పెద్దగా మార్పులకు ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
టెస్టు కెపె్టన్‌గా రాణించి అన్ని ఫార్మాట్‌లకు నాయకుడిగా పరిగణనలోకి తీసుకుంటున్న గిల్‌తో పాటు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ కూడా టి20 రేసులోకి వచ్చారు. దీనికి తోడు ఐపీఎల్‌లో ఆటను గుర్తిస్తే శ్రేయస్ అయ్యర్‌కు కూడా అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలో ఆసియా కప్ కోసం సెలక్టర్లు ఎలాంటి జట్టును ప్రకటిస్తారనేది ఆసక్తికరం.
న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోరీ్నలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు ప్రకటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే స్వదేశంలో టి20 వరల్డ్ కప్ కూడా ఉన్న నేపథ్యంలో ఇదే జట్టును అప్పటి వరకు సన్నద్ధం చేసే ఆలోచనతో సెలక్టర్లు ఉన్నారు. సెపె్టంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆసియా కప్ జరుగుతుంది. 15 మంది సభ్యులతో టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉండగా... ఇటీవల యువ ఆటగాళ్లు తమకు లభించిన అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంతో జట్టులో చోటుపై గట్టి పోటీ నెలకొంది.
తిలక్ వర్మకు పోటీ!
ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ తమ ఆటతో స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన చివరి టి20 సిరీస్‌లో అభిషేక్ 219.68 స్ట్రయిక్‌రేట్‌తో 279 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో సామ్సన్ కాస్త తడబడినా... అంతకుముందు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై చెలరేగి ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు సాధించాడు. ఈ స్థితిలో గిల్, జైస్వాల్‌ను తీసుకొచ్చి కూర్పును చెడగొడతారా అనేది సందేహమే. రిజర్వ్ ఓపెనర్‌గా జైస్వాల్‌ను గానీ, గిల్‌ను కానీ తీసుకొస్తే సామ్సన్‌ను పక్కన పెట్టక తప్పదు.
మూడో స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు సహా 280 పరుగులు చేసి కుదురుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో అతను ఆకట్టుకోలేకపోగా, ఇక్కడే శ్రేయస్ అయ్యర్ నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేసిన శ్రేయస్ సవాల్ విసురుతున్నాడు. నాలుగులో సూర్యకుమార్ ఖాయం కాగా, వరల్డ్ కప్ విజయం సహా గత రెండేళ్లుగా ఐదో స్థానాన్ని శివమ్ దూబే సొంతం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానానికి ఢోకా లేకపోగా, ఏడో స్థానం కోసం రింకూ సింగ్ పోటీ పడుతున్నాడు. చివర్లో దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే అయినా గత కొన్ని మ్యాచ్‌లలో రింకూ నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కొత్తగా ఒక అదనపు ఆల్‌రౌండర్ ఉంటే మేలని భావిస్తే ముందుగా రింకూ స్థానమే ప్రశ్నార్ధకంగా మారనుంది.
బుమ్రా ఖాయం...
స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఖాయం. ఆల్‌రౌండర్‌గా అక్షర్ ఎంతో విలువైన ఆటగాడు కాగా, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 14 వికెట్లతో వరుణ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గాయంతో వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్‌లో ఆడని కుల్దీప్ కోలుకొని చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. అతను టి20 టీమ్‌లోకి రావడం లాంఛనమే. మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అనుకుంటే వాషింగ్టన్ సుందర్ అందరికంటే ముందున్నాడు. అతని తాజా ఫామ్ కూడా అనుకూలం కానుంది. మూడో పేసర్‌గా హార్దిక్ ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ పేసర్లుగా బుమ్రా, అర్‡్షదీప్‌ల స్థానాలకు ఢోకా లేదు.
మరో పేసర్‌గా ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ అందుబాటులో ఉన్నా... వీరి ఎంపిక సందేహమే. కొంత విశ్రాంతి తీసుకొని టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాలని వీరిద్దరికి సెలక్టర్లు సూచించే అవకాశాలే ఎక్కువ. ఇంగ్లండ్‌తో ఆడిన తర్వాత ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన మొహమ్మద్ షమీ అంతర్జాతీయ టి20 కెరీర్ ఇక ముగిసినట్లుగానే భావించవచ్చు. గాయం వల్ల నితీశ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేడు. రెండో వికెట్ కీపర్‌గా ఐపీఎల్‌లో ఆకట్టుకున్న జితేశ్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేయవచ్చు. జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉన్న 15 మంది సభ్యులు (అంచనా): సూర్యకుమార్ (కెపె్టన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.