మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు.
లిచ్‌ఫీల్డ్ సూపర్ సెంచరీ..
తొలుత ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మెరుపు సెంచరీతో చెలరేగింది. 22 ఏళ్ల లిచ్‌ఫీల్డ్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. 93 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎల్లీస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), గార్డెనర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.
బౌలర్లు విఫలం..
ఈ కీలక పోరులో భారత బౌలర్లు చెతులేత్తేశారు. స్పిన్నర్ శ్రీచరణి మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 9.5 ఓవర్లు బౌలిగ్ చేసిన దీప్తీ.. రెండు వికెట్లు పడగొట్టినప్పటికి ఏకంగా 73 పరుగులు సమర్పించుకుంది. ఆమెతో పాటు రాధా యాదవ్, అమన్ జ్యోత్ కౌర్ కూడా భారీగా పరుగులిచ్చారు. భారత బౌలింగ్‌ను కంగారులు ఓ ఆట ఆడుకున్నారు. చరణి మాత్రం తన 10 ఓవర్ల కోటాలో 49 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించింది.
చెత్త ఫీల్డింగ్..
ఇక ఫీల్డింగ్‌లో టీమిండియా తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మ్యాచ్‌లో కూడా ఫీల్డింగ్‌లో భారత్ తీవ్ర నిరాశపరిచింది. తొలుత హర్మన్ ప్రీత్ విడిచిపెట్టిన క్యాచ్ నుంచి మొదలైన ఫీల్డింగ్ కష్టాలు మ్యాచ్ ఆఖరి వరకు కొనసాగాయి.
ఈ మ్యాచ్‌లో మిస్ ఫీల్డ్స్, బంతిని సరిగ్గా అందుకోకపోవడం, ఓవర్ త్రోస్ వంటి తప్పిదాలను భారత ఫీల్డర్లు చేశారు. అందుకు భారత్ భారీ మూల్యం చెల్సించుకోవాల్సి వచ్చింది. టీమిండియా ప్లేయర్లు సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే ఆసీస్ స్కోర్ 300 పరుగుల మార్క్‌ను దాటకపోయేది.
ఈ టోర్నీలో భారత జట్టు ఫీల్డింగ్ గణాంకాలు
పట్టిన క్యాచ్‌లు- 35
వదిలేసిన క్యాచ్‌లు-18
క్యాచింగ్ సామర్థ్యం- 66%
మిస్ అయిన స్టంపింగ్‌లు- 3
మిస్‌ఫీల్డ్‌లు - 74
ఓవర్‌త్రోలు అయిన బంతులు- 6
చదవండి: IND vs SA: టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ ఫెయిల్! అయినా భారీ స్కోర్


