బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటలో భారత్‌పై సౌతాఫ్రికా బ్యాటర్లు పై చేయి సాధించారు. ప్రోటీస్ ఎ జట్టు డే వన్ ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.
క్రీజులో షెపో మోరెకి(4), కుహ్లే సెలె(0) ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్(71), హంజా(66), రుబిన్ హెర్మాన్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ మార్క్స్ అకెర్మాన్(18) పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ముంబై స్పిన్నర్ తనీష్ కొటియన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మానవ్ సుత్తర్ రెండు, అన్షుల్ కాంబోజ్, ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.
పంత్ రీ ఎంట్రీ..
ఇండియా-ఎ జట్టుకు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పంత్.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ కాలి మడమకు గాయమైంది.
దీంతో అతడు దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో భారత్-ఎ తరపున ఆడాలని రిషబ్ నిర్ణయించుకున్నాడు. రెండో అనాధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.
చదవండి: IND vs SA: లంచ్‌కు ముందే టీ బ్రేక్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి


