
ఆసియాకప్-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా స్పిన్ ఉచ్చులో యూఏఈ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఓపెనర్లు అలీషన్ షరాఫు(22), కెప్టెన్ వసీం మహ్మద్(19) ఆరంభంలో పర్వాలేదన్పించారు. షరాఫూను బుమ్రా ఔట్ చేశాక యూఏఈ వికెట్ల పతనం మొదలైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ శివమ్ దూబే మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలా వికెట్ సాధించారు.
అభిషేక్ ధానాధన్..
అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్(20), సూర్యకకుమార్ యాదవ్(7) ఆజేయంగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్క వికెట్ సాధించాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.
చదవండి: Asia Cup 2025: జస్ప్రీత్ బుమ్రా సూపర్ యార్కర్.. దెబ్బకు బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో