ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించే సత్తా భారత్‌కు ఉంది..

India Can Field Three Teams At The Same Time Says Kamran Akmal - Sakshi

కరాచీ: ప్రస్తుతం భారత క్రికెట్ చాలా పటిష్ఠంగా ఉందని, ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించి, విజయాలు సాధించే సత్తా భారత్‌కు మాత్రమే ఉందని పాక్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్‌ ఈ స్థాయికి చేరడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అవలంబిస్తున్న విధానాలే కారణమని, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో బీసీసీఐని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని ఈ పాక్‌ మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ సూచించాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ లాంటి లీగ్‌లు భారత యువ ఆటగాళ్ల పాలిట వరంలా మారాయని, ఈ తరహా టోర్నీల వల్ల మేటి ఆటగాళ్లు ఉద్భవిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. శ్రీలంక పర్యటనకు భారత్ రెండో జట్టు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పాక్‌ మాజీ ఆటగాడు స్పందిస్తూ.. 

శ్రీలంక పర్యటనకు భారత సీ జట్టు వెళ్లినా సునాయసంగా గెలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాడు మార్గనిర్దేశం చేస్తుండటం భారత క్రికెట్‌ ఉన్నతికి మరో కారణమని ఆయన పేర్కొన్నాడు. ద్రవిడ్‌ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది యువ క్రికెటర్లు లైమ్‌లైట్‌లోకి వచ్చారని, టీమిండియా హెడ్‌ కోచ్​రవిశాస్త్రి కూడా జట్టుకు అద్భుతంగా సేవలందిస్తున్నాడని ప్రశంసించాడు. మాజీ కెప్టెన్ ధోనీ నాయకత్వాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ అందిపుచ్చుకున్నాడని, విరాట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడని, అతను కూడా గాయపడితే ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్ చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు.  

ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్‌ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. భారత బి జట్టు శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. భారత జట్టు ఏక కాలంలో రెండు అంతార్జాతీయ జట్లతో రెండు వేర్వేరు సిరీస్‌లలో పాల్గొననుంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు యూకే పర్యటనకు వెళ్తుండగా.. అదే సమయంలో భారత బి జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. భారత బి జట్టుకు కోచ్‌గా భారత మాజీ క్రికెటర్, ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనుండగా, బి జట్టుకు సీనియర్‌ ఆటగాడు ధవన్‌ సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
చదవండి: Sachin Tendulkar: ఆ రెండు కోరికలు నెరవేరలేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top