
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో (India A vs Australia A) జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టుకు (Team India) ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు. 92 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
బ్యాటింగ్ చేస్తుండగా అసౌకర్యానికి గురైన రాహుల్ ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దేవ్‌దత్ పడిక్కల్ (8 బంతుల్లో 5) ఇలా వచ్చి అలా ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (44), మానవ్ సుతార్ (1) ఛేదనను కొనసాగిస్తున్నారు.
అంతకుముందు ఓపెనర్ ఎన్ జగదీసన్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోర్ 169/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఇంకా 243 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఛేదనకు భారత్‌కు రేపు కూడా అవకాశం ఉంది.
దీనికి ముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ తలో 3.. సిరాజ్, యశ్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆ జట్టు తరఫున కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (85 నాటౌట్), ఫిలిప్ (50) మాత్రమే అర్ద సెంచరీలతో రాణించారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (75) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రాహుల్ (11), జగదీసన్ (38), ఆయుశ్ బదోని (21), ప్రసిద్ద్ కృష్ణ (16 రిటైర్డ్ హర్ట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో థార్న్‌టన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. మర్ఫీ 2, సదర్‌ల్యాండ్, రొచ్చిక్కియోలీ, కన్నోల్లీ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మెక్‌స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88), మర్ఫీ (76) అర్ద సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. గుర్నూర్ బ్రార్ 3, సిరాజ్, ప్రసిద్ద్ తలో వికెట్ తీశారు.
కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇదివరకే తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తి కాగా.. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన