
ఆసియాకప్-2025లో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో యూఏఈను 41 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూపర్ 4కు ఆర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 21(ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్‌ను చిత్తు చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గత ఆదివారం(సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్ షేక్ వివాదమే ఎక్కువగా హైలెట్ అయింది. ఈ మ్యాచ్‌లో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరాచాలనాన్ని తిరష్కరించారు.
దీంతో ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాప్ట్‌పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్‌లో ప్రత్యర్ధి ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడం తప్పనిసారి అని లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించనుంది.
చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి