
PC: Sony X
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ (Ind Vs Pak) ఆది నుంచే తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ల ధాటికి తాళలేక నామమాత్రపు స్కోరు కూడా చేయలేకపోయింది.
అభిషేక్ శర్మ ధనాధన్
ఏదేమైనా బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా.. బౌలింగ్‌లో మాత్రం పాక్ తేలిపోయింది. దాయాది విధించిన లక్ష్యాన్ని పటిష్ట టీమిండియా 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఓపెనర్లలో అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31) మరోసారి విధ్వంసం సృష్టించగా.. శుబ్‌మన్ గిల్ (10) మాత్రం ఈసారి విఫలమయ్యాడు.
రాణించిన తిలక్, సూర్య
అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్)తో కలిసి.. నాలుగో నంబర్ బ్యాటర్ తిలక్ వర్మ (31 బంతుల్లో 31) మెరుగ్గా రాణించాడు. అయితే, పన్నెండో ఓవర్లో తిలక్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
మూడుసార్లు ప్రయత్నించినా
ఇందుకు పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ పొరపాటే కారణం. తన బౌలింగ్‌లో తిలక్ ఇచ్చిన స్ట్రెయిట్ క్యాచ్‌ను పట్టడంలో నవాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మూడుసార్లు ప్రయత్నించినా బంతిని ఒడిసిపట్టలేకపోయాడు. దీంతో తిలక్ వర్మ.. ‘మనం సేఫ్’ అన్నట్లుగా చిరునవ్వులు చిందించగా.. మహ్మద్ నవాజ్ మాత్రం నేలపై పంచ్‌లు కొడుతూ తనను తాను తిట్టుకున్నాడు.
ఇంతలో మరో ఎండ్‌లో ఉన్న సూర్య వేగంగా స్పందించి.. రనౌట్ ప్రమాదం జరగకుండా చూసుకున్నాడు. అంతేకాదు.. జాగ్రత్తగా ఉండమంటూ తిలక్‌కు సైగ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!
‘‘ఒకటి.. రెండు.. మూడు.. అయ్యో పాపం!.. ప్రపంచంలోని బెస్ట్ స్పిన్నర్ ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తాడా?’’ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ హెడ్‌కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఇలా కౌంటర్లు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సూర్యకుమార్‌తో కలిసి శివం దూబే (7 బంతుల్లో 10) ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆసియా కప్ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం. తొలుత యూఏఈని ఓడించిన టీమిండియా.. తాజాగా పాక్‌పై గెలిచి సూపర్-4కు లైన్ క్లియర్ చేసుకుంది.
చదవండి: ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య
Looked simple… until the ball turned lava 🤭
Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/wVztsgkJv3— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025