
టీమిండియాతో మ్యాచ్‌లో ఒమన్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అంచనాలకు మించి రాణించి.. గెలుపు కోసం సూర్యుకుమార్ సేనను శ్రమించేలా చేసింది. పటిష్ట భారత జట్టుకు గట్టి పోటీనిచ్చి సత్తా చాటి ప్రశంసలు అందుకుంటోంది.
ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం టీమిండియాను ఢీకొట్టింది ఒమన్. అబుదాబి వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ మరోసారి ధనాధన్ (15 బంతుల్లో 38) దంచికొట్టగా.. శుబ్‌మన్ గిల్ (Shubman Gill- 5) మరోసారి నిరాశపరిచాడు.
సంజూ శాంసన్ అర్ధ శతకం
ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) అర్ధ శతకం (56)తో రాణించి భారత ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేట్ (13 బంతుల్లో 26), తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్) రాణించారు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, జితేన్ రామనంది, ఆమిర్ ఖలీమ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
ఒమన్ టాపార్డర్ సూపర్ హిట్
ఇక టీమిండియా విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ శుభారంభం అందుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఫర్వాలేదనిపించగా.. ఆమిర్ ఖలీమ్ అద్భుత అర్ధ శతకం (46 బంతుల్లో 64, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు.
ఇక వన్‌డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా సైతం హాఫ్ సెంచరీ (33 బంతుల్లో 51) చేశాడు. అయితే, జతీందర్‌ను కుల్దీప్ యాదవ్, ఆమిర్‌ను హర్షిత్ రాణా, మీర్జాను హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు పంపడంతో ఒమన్ జోరుకు బ్రేక్ పడింది. మిగిలిన వారిలో వికెట్ కీపర్ వినయ్ శుక్లా (1)ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు.
అంచనాలు తలకిందులు
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన ఒమన్.. 167 పరుగుల వద్ద నిలిచింది. దీంతో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచి.. లీగ్ దశను అజేయంగా ముగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై భారత జట్టు ఏకపక్ష విజయం సాధిస్తుందని అంతా ఊహించారు.
కానీ అంచనాలు తలకిందులు చేస్తూ సూర్యసేనకు జతీందర్ సింగ్ బృందం గట్టి పోటీనిచ్చింది. టీ20 ఫార్మాట్లోని మజాను పంచింది. ఒమన్ ఆట తీరుకు భారత జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఒమన్ ఆటగాళ్లతో ముచ్చటిస్తూ వారిపై ప్రశంసలు కురిపించాడు.

ఆమిర్ ఖలీమ్‌ను హగ్ చేసుకున్న సూర్య
అంతేకాదు.. ఒమన్‌పై గెలిచిన తర్వాత ఇరుజట్లు ఆటగాళ్లు కరచాలనం చేసే సమయంలో సూర్య చేసిన పని వైరల్‌గా మారింది. 43 ఏళ్ల వయసులో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన ఆమిర్ ఖలీమ్‌ను సూర్య ఆలింగనం చేసుకున్నాడు. అయితే, అతడు పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన వాడు కావడం గమనార్హం.
ఇలా ఎందుకు చేశావు? నీకిది తగునా?
ఈ నేపథ్యంలో ఆమిర్‌ను అభినందిస్తూ సూర్య చేసిన పనిని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం .. ‘‘పాక్‌కు చెందిన వ్యక్తిని ఎలా హత్తుకుంటావు?’’ అని ప్రశ్నిస్తున్నారు.
కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో ముఖాముఖి తలపడిన టీమిండియా.. ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. బాధితులకు అండగా మెగా వేదికగా ఇలా నిరసన తెలిపింది. అయితే, సూర్య ఇప్పుడిలా అదే దేశానికి చెందిన ఆటగాడిని హగ్ చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది.
జట్టంతా ఒకే కుటుంబమని..
కాగా యూఏఈతో పాటు ఒమన్ క్రికెట్ జట్లలో భారత్, పాక్‌కు చెందిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయం గురించి యూఏఈ కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ మాట్లాడుతూ.. తమ జట్టంతా ఒకే కుటుంబమని.. యూఏఈనే తమ దేశమని.. తమలో భారత్, పాక్ అనే మాట వినిపించవని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్‌ను సూర్య హత్తుకోవడం నేరమేమీ కాదంటూ అతడి ఫ్యాన్స్ సపోర్టు చేసుకుంటున్నారు.
చదవండి: PKL 12: తెలుగు టైటాన్స్ గెలుపుబాట
𝘚𝘶𝘳𝘺𝘢 𝘋𝘢𝘥𝘢, 𝘦𝘬 𝘩𝘪 𝘥𝘪𝘭 𝘩𝘢𝘪𝘯, 𝘬𝘪𝘵𝘯𝘦 𝘣𝘢𝘢𝘳… 💙
Encouraging words from India’s captain to Oman’s heroes ✨
Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/Mng5zOIrOH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025