IND VS ENG 5th Test: విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్‌

IND VS ENG 5th Test: Yashasvi Jaiswal Breaks Virat Kohli Record Of Most Runs In A Test Series Vs England - Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ చరిత్ర సృష్టించాడు. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్‌ పేరిట ఉండేది.

విరాట్‌ 2016-17లో స్వదేశంలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 109.2 సగటున 655 పరుగులు చేశాడు. తాజా ఇంగ్లండ్‌ సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌ కోహ్లి పేరిట ఉండిన ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌లో (2023-24) యశస్వి ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో ​93.71 సగటున 657 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి 2 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కుల్దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్‌ 27, పోప్‌ 11, రూట్‌ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్‌ 0, ఫోక్స్‌ 24, హార్ట్లీ 6, వుడ్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్‌ బషీర్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు..

  • యశస్వి జైస్వాల్‌ 9 ఇన్నింగ్స్‌ల్లో 657 పరుగులు (స్వదేశంలో 2023-24)
  • విరాట్‌ కోహ్లి 8 ఇన్నింగ్స్‌ల్లో 655 (స్వదేశంలో 2016-17)
  • రాహుల్‌ ద్రవిడ్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 602 (ఇంగ్లండ్‌లో 2002)
  • విరాట్‌ కోహ్లి 10 ఇన్నింగ్స్‌ల్లో 593 (ఇంగ్లండ్‌లో 2018)
  • విజయ్‌ మంజ్రేకర్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 586 (స్వదేశంలో 1961-62)

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top