Ind Vs Aus: టెస్టుల్లో సూర్య అరంగేట్రం ఖాయం! ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ మర్చిపోవద్దన్న బీసీసీఐ సెలక్టర్‌

Ind Vs Aus: BCCI Selector Hints Suryakumar Test Debut He Has 5000 FC Runs - Sakshi

IND vs AUS Test series- Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న సిరీస్‌తో టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రిషభ్‌ పంత్‌ గైర్హాజరీ, శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నేపథ్యంలో ఈ ముంబై బ్యాటర్‌ ఎంట్రీకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు  బీసీసీఐ సెలక్టర్‌ శ్రీధరన్‌ శరత్‌ సూర్య అరంగేట్రానికి సంబంధించి సంకేతాలు ఇచ్చాడు.

కాగా పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న సూర్య ఇటీవలే ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికై సత్తా చాటిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ నంబర్‌ 1గా కొనసాగుతున్న అతడి ఫస్ట్‌క్లాస్‌ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు సూర్య. అయితే, రంజీల్లో అదరగొడుతున్న పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి విధ్వంసకర బ్యాటర్లను కాదని సూర్యకు ఎలా ఛాన్స్‌ ఇస్తారంటూ వ్యతిరేకత వ్యక్తమైంది.

మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ సెలక్టర్‌ శ్రీధరన్‌ శరత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రత్యర్థి చేతి నుంచి మ్యాచ్‌ను అమాంతం లాగేసుకోగల సత్తా సూర్యకుమార్‌ యాదవ్‌కు ఉంది. బౌలర్లను అటాక్‌ చేస్తూ వైవిధ్యభరిత షాట్లు ఆడగలడు. 

ఫస్ట్‌క్లాస్‌లో తను 5000 వేల పరుగులు చేశాడని మర్చిపోవద్దు’’ అంటూ స్పోర్ట్స్‌స్టార్‌తో వ్యాఖ్యానించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే క్రమంలో ఆసీస్‌తో జరుగనున్న సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని హింట్‌ ఇచ్చాడు.

కాగా ఇటీవల రంజీ ట్రోఫీలో ముంబైకి ఆడిన సూర్య వరుసగా 90, 95 పరుగులు చేశాడు. మరోవైపు.. కారు ప్రమాదం కారణంగా రిషభ్‌ పంత్‌ మరికొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు.

ఫిబ్రవరిలో
ఒకవేళ అతడు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సమయానికి కోలుకోకుంటే సూర్య అరంగేట్రం ఖాయమేనని చెప్పవచ్చు. ఇక రిషభ్‌ పంత్‌ స్థానంలో కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్టులు ఆడనున్నాయి.

చదవండి: Ind Vs NZ: ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్‌ను తీసుకోండి.. పృథ్వీ షా కంటే బెటర్‌: టీమిండియా మాజీ ప్లేయర్‌
Umpire Marais Erasmus: బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్‌ ఎందుకు?
అందుకే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదు! మౌనం వీడిన బీసీసీఐ సెలక్టర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top