Umpire Marais Erasmus: బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్‌ ఎందుకు?

Umpire Marais Erasmus Distracted Miss Entire Delivery SA vs ENG 1st ODI - Sakshi

క్రికెట్‌లో ఆటగాళ్లతో పాటు అంపైర్ల పాత్ర కూడా చాలా కీలకం. బౌలర్‌ ఎన్ని బంతులు వేస్తున్నాడు.. బ్యాటర్లు ఎన్ని పరుగులు తీశారు.. వైడ్‌ బాల్స్‌, నో బాల్స్‌, సిక్సర్లు, బౌండరీలు, క్యాచ్‌లు, ఎల్బీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఫీల్డ్‌ ఉన్న ఇద్దరు అంపైర్లు చాలా బిజీగా ఉంటారు. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగితే రాజీ కుదర్చడం కూడా అంపైర్ల బాధ్యత. 

బాధ్యతతో కూడిన అంపైరింగ్‌లో నిర్లక్ష్యం వహించడం ఎప్పుడైనా చూశారా. చూడకపోతే మాత్రం సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ను రీక్యాప్‌ చేయండి. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లెగ్‌ అంపైర్‌ మరాయిస్‌ ఎరాస్మస్‌ బౌలర్‌ వేసిన బంతిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడం కనిపించింది. ఇందులో మరొక విషమేంటంటే.. ఆ సమయంలో ఎరాస్మస్‌ వెనక్కి తిరిగి చేతితో ఏదో లెక్కబెడుతున్నట్లు కనిపించింది. అప్పటికే అన్‌రిచ్‌ నోర్ట్జే బంతి వేయడం.. క్రీజులో ఉ‍న్న జేసన్‌ రాయ్‌ షాట్‌ ఆడడం జరిగిపోయాయి.

ఇంగ్లండ్‌ బ్యాటర్లు పరిగెత్తే సమయంలో అంపైర్‌ ఎరాస్మస్‌ అప్పుడే మేల్కొన్నట్లు ముందుకు తిరగడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా 24వ ఓవర్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ చూసిన అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''వన్డే క్రికెట్‌పై బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. అంపైర్‌ పని కాకుండా అంత బిజీగా ఏం చేస్తున్నాడబ్బా.. పట్టించుకోవడం లేదు కాబట్టే ప్రతీది థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేస్తున్నారనుకుంటా.. గుత్కా సుప్రీమసీ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 27 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. వాండర్‌ డుసెన్‌ (117 బంతుల్లో 111 పరుగులు, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీతో మెరవగా.. డేవిడ్‌ మిల్లర్‌ 53 పరుగులతో రాణించాడు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(91 బంతుల్లో 113 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ వృథాగా మారింది. డేవిడ్‌ మలన్‌(59 పరుగులు)మినహా మిగతావారు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేకపోయారు. ప్రొటిస్‌ బౌలర్లలో అన్‌రిచ్‌ నోర్ట్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిసందా మగల మూడు, కగిసో రబడా రెండు, తబ్రెయిజ్‌ షంసీ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: 'ప్రయోగాలకు స్వస్తి పలకండి'.. బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఆగ్రహం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top