‘సంజూకు మామయ్యలాంటి వాడిని’ | Shashi Tharoor Recalls Meeting 14-Year-Old-Sanju Samson Uncle Relation | Sakshi
Sakshi News home page

‘సంజూకు మామయ్యలాంటి వాడిని’

Mar 20 2026 7:10 PM | Updated on Mar 20 2026 7:30 PM

Shashi Tharoor Recalls Meeting 14-Year-Old-Sanju Samson Uncle Relation

భారత జట్టు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్‌ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్‌తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. 

ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’‌గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్‌ ముఖ్యంగా సెమీఫైనల్‌, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌ సంజూ శాంసన్‌తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. 

‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్‌ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్‌కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్‌తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్‌ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. 

ఇవాళ గంభీర్‌ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్‌ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. 

శాంసన్‌ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్‌కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్‌గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. 

ఇంతకాలం ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్‌ ఈ సీజన్‌ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడు. తన ఫెవరెట్‌ క్రికెటర్‌ అయిన ఎంఎస్‌ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్‌ ఇటీవలే సీఎస్‌కే ప్రాక్టీస్‌లో జాయిన్‌ అయిన సందర్భంగా వెల్లడించాడు.

చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్‌.. సంచలనం రిపీటయ్యేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement