
స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో హాఫ్ సెంచరీ, రెండో వన్డేలో సెంచరీ చేసిన ఆమె.. ఇవాళ (సెప్టెంబర్ 20) జరుగుతున్న మూడో వన్డేలో మరో హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బెత్ మూనీ (75 బంతుల్లో 138) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 412 పరుగుల రికార్డు స్కోర్ చేయగా.. భారత్ కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంధన 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
మహిళల వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. దీనికి ముందు రిచా ఘోష్ (26 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండేది. ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో మంధన మెగ్ లాన్నింగ్, ఆష్లే గార్డ్‌నర్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉంది.
లాన్నింగ్, గార్డ్‌నర్ కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు విండీస్‌కు చెందిన డియాండ్ర డొట్టిన్ (20 బంతుల్లో) పేరిట ఉంది.
413 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పోరాడితే పోయేది ఏముందన్న రీతిలో టీమిండియా ఎదురుదాడి చేస్తుంది. 16 ఓవర్ల తర్వాత భారత్ జట్టు స్కోర్ 164/2గా ఉంది. మంధన 92 పరుగుల (46 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆమెకు జతగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (24 బంతుల్లో 40; 7 ఫోర్లు) క్రీజ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఇంకా 249 పరుగులు చేయాలి.