తిప్పేసిన మోసిన్ ఖాన్
రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకే కేరళ ఆలౌట్
రంజీ ట్రోఫీ రౌండప్
తిరువనంతపురం: స్పిన్నర్ మోసిన్ ఖాన్ (6/29) తిప్పేయడంతో రంజీ ట్రోఫీలో కర్ణాటక భారీ విజయం సాధించింది. కేరళ సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో కర్నాటక ఇన్నింగ్స్ 164 పరుగుల తేడాతో కేరళపై ఘనవిజయం సాధించింది. ఈ సీజన్‌లో కర్ణాటక జట్టుకిది తొలి గెలుపు. సౌరాష్ట్ర, గోవాలతో జరిగిన గత రెండు మ్యాచ్‌లు కూడా ‘డ్రా’గానే ముగిశాయి. డబుల్ సెంచరీతో భారీస్కోరుకు బాట వేసిన కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మంగళవారం 10/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కేరళ... సొంతగడ్డపై కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఫాలోఆన్ ఆడిన కేరళ 79.3 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ కృష్ణప్రసాద్ (33; 5 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు ని«దీశ్ (9), అక్షయ్ చంద్రన్ (0)లను పేసర్ విద్వత్ కావేరప్ప వరుస బంతుల్లో అవుట్ చేయడంతోనే కేరళ పతనం మొదలైంది.
కెప్టెన్ అజహరుద్దీన్ (15)ను శిఖర్ పెవిలియన్ చేర్చగా మిగతా బ్యాటర్లకు మోసిన్ స్పిన్ ఉచ్చు బిగించడంతో కేరళ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. నిజానికి 140 పరుగులకే 9 వికెట్లను కోల్పోయిన కేరళ 150 పరుగుల్లోపే ఆలౌట్ ఖాయమనిపించింది. అయితే ఆఖరి వరుస బ్యాటర్ ఇడెన్ ఆపిల్ టామ్ (68 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు) చేసిన పోరాటంతో కర్ణాటక విజయం కాస్త ఆలస్యమైంది.
మిగతా మ్యాచ్‌ల్లో గ్రూప్ ‘ఎ’లో జార్ఖండ్ ఇన్నింగ్స్ 196 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై జయభేరి మోగించింది. వడోదరలో వర్షం వల్ల బరోడా, ఉత్తర ప్రదేశ్ మ్యాచ్‌లో అసలు టాస్ కూడా పడలేదు. మ్యాచ్ పూర్తిగా వర్షార్పణమైంది. ‘బి’లో సౌరాష్ట్ర–మహారాష్ట్ర, పంజాబ్–గోవా, మధ్యప్రదేశ్–చండీగఢ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
విహారి, మురాసింగ్‌ల పోరాటంతో...
అగర్తలా: హనుమ విహారి (253 బంతుల్లో 141; 19 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ మణిశంకర్ మురాసింగ్ (130 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు)ల పోరాటంతో త్రిపుర డ్రాతో గట్టెక్కడమే కాదు... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కూడా సంపాదించింది. దీంతో గ్రూప్ ‘సి’లో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర కీలకమైన 3 పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
ఓవర్‌నైట్ స్కోరు 273/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన త్రిపుర 103.2 ఓవర్లలో 385 పరుగుల వద్ద ఆలౌటైంది. తద్వారా బెంగాల్ (336)పై తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు ఆధిక్యం లభించింది. మూడో రోజే విహారి శతక్కొట్టగా, ఆఖరి రోజు మురాసింగ్ వన్డేను తలపించే విధంగా ధాటిగా ఆడి సెంచరీ సాధించాడు. ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు.
విహారి అవుటయ్యాక టెయిలెండర్ రాణా దత్త (27; 4 ఫోర్లు) కూడా మురాసింగ్‌కు అండగా నిలిచాడు. బెంగాల్ బౌలర్లలో భారత వెటరన్ సీమర్ షమీకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కైఫ్ 4, ఇషాన్ పొరెల్ 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన బెంగాల్ 25 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. షహబాజ్ అహ్మద్ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించాడు.
శ్రమించి గెలిచిన హరియాణా
అహ్మదాబాద్: గ్రూప్ ‘సి’లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సులువైన 62 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా హరియాణా తెగ కష్టపడింది. చివరకు 6 వికెట్లు కోల్పోయి ఈ ఆరు పదుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. మొత్తానికి గ్రూప్ ‘సి’లోనే కాదు... ఈ సీజన్‌లోనే అన్ని గ్రూపుల్లో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టుగా హరియాణా ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించింది. మంగళవారం 113/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ 60.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది.
ఇంకో 24 పరుగులు చేసి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. రవి బిష్ణోయ్ (2)ని పార్థ్‌వత్స (2/38), క్షితిజ్ పటేల్ (37; 2 ఫోర్లు)ను నిఖిల్ కశ్యప్ (4/59) అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల ఆధిక్యం పొందిన హరియాణా ముందు కేవలం 62 పరుగుల లక్ష్యమే ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హరియాణా టాప్–6 బ్యాటర్లు లక్ష్యయ్ (1), అంకిత్ (1), శాండిల్యా (3), నిశాంత్ (13), అమన్ (3), ధీరు సింగ్ (13)లను గుజరాత్ బౌలింగ్ త్రయం విశాల్ (3/23), సిద్ధార్థ్ దేశాయ్ (2/25), బిష్ణోయ్ (1/13) మూకుమ్మడిగా అవుట్ చేయడంతో 43 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది.
పార్థ్ వత్స (14 నాటౌట్), యశ్‌వర్ధన్ (13 నాటౌట్) అజేయంగా నిలువడంతో హరియాణా 4 వికెట్ల తేడాతో గెలిచి నిట్టూర్చింది. ఇదే గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ల అద్భుత ప్రతిభతో ఉత్తరాఖండ్ 17 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందింది. 123 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి రోజు 71/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సర్వీసెస్ 48.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులు మాత్రమే చేసి మిగతా సగం (5) వికెట్లను కోల్పోయింది. మయాంక్ మిశ్రా (5/45), సుచిత్ (2/12), అవనీశ్ (2/27) సర్వీసెస్ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు.


