IND vs AUS: యువీ మెరుపు ఇన్నింగ్స్‌.. చెలరేగిన షాబాజ్‌! ఫైనల్లో భారత్‌ | IML 2025: Sachin, Yuvraj, Nadeem Shines As India Beat Australia And Enters Into Final, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IML 2025 IND Vs AUS: సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. ఫైనల్లో భారత్‌

Published Fri, Mar 14 2025 8:44 AM | Last Updated on Fri, Mar 14 2025 10:18 AM

IML 2025: Sachin Yuvi Nadeem Shines India Beat Australia Enters Final

అంతర్జాతీయ మాస్టర్స్‌ లీగ్‌-2025 (International Masters League T20) సెమీస్‌లో భారత జట్టు అదరగొట్టింది. ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. రాయ్‌పూర్‌ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్‌ కంగారూలపై ఏకంగా 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

ఆరు జట్లు 
ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో అంతర్జాతీయ మాస్టర్స్‌ లీగ్‌ ఈ ఏడాది మొదలైంది. టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో ఇండియా మాస్టర్స్‌, శ్రీలంక మాస్టర్స్‌, ఆస్ట్రేలియా మాస్టర్స్‌, వెస్టిండీస్‌ మాస్టర్స్‌, సౌతాఫ్రికా మాస్టర్స్‌, ఇంగ్లండ్‌ మాస్టర్స్‌ రూపంలో ఆరుజట్లు పాల్గొంటున్నాయి.

భారత్‌ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు లీగ్‌ దశలోనే నిష్క్రమించగా.. ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో గురువారం షాహిద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్లో ఇండియా- ఆసీస్‌ తలపడ్డాయి.

సచిన్‌, యువీ, పఠాన్‌ సోదరుల మెరుపులు
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మాస్టర్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మాస్టర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 220 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ అంబటి రాయుడు(5) విఫలం కాగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 42 పరుగులు సాధించాడు.

మిగతా వాళ్లలో యువరాజ్‌ సింగ్‌ 30 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపగా.. స్టువర్ట్‌ బిన్నీ (Stuart Binny) 21 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. యూసఫ్‌ పఠాన్‌ 10 బంతులు ఎదుర్కొని 23 రన్స్‌ చేయగా.. అతడి సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌(7 బంతుల్లో 19 నాటౌట్‌) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇక ఇండియా మాస్టర్స్‌ విధించిన 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మాస్టర్స్‌ 126 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌, ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌(5) పూర్తిగా నిరాశపరచగా.. షాన్‌ మార్ష్‌, బెన్‌ డంక్‌ చెరో 21 పరుగులు చేశారు. మిగతా వాళ్లలో నాథన్‌ రీర్డాన్‌(21), బెన్‌ కట్టింగ్‌(39) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

షాబాజ్‌ నదీమ్‌కు నాలుగు వికెట్లు
భారత బౌలర్లలో స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి.. కేవలం 15 పరుగులే ఇచ్చాడు. 

మిగతా వారిలో పేసర్లు వినయ్‌ కుమార్‌(2/10), ఇర్ఫాన్‌ పఠాన్‌(2/31) రెండేసి వికెట్లు దక్కించుకోగా.. బిన్నీ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్‌ బౌలర్‌ పవన్‌ నేగి మూడు ఓవర్ల కోటాలో 13 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు.

ఇక ఇండియా మాస్టర్స్‌ బౌలర్ల విజృంభణ కారణంగా ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా 94 పరుగులతో ఘన విజయం సాధించిన ఇండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక శుక్రవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో శ్రీలంక- వెస్టిండీస్‌ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం టైటిల్‌ పోరులో ఇండియా మాస్టర్స్‌ను ఢీకొట్టనుంది.  

చదవండి: CT 2025: కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు దక్కని చోటు.. కెప్టెన్‌గా అతడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement