
బౌలింగ్‌లో ఐదో ర్యాంక్‌కు దీప్తి
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్మృతి మంధాన అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో 300 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్మృతి మొత్తం 818 ర్యాంకింగ్ పాయింట్లతో తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. స్మృతి, రెండో స్థానంలో ఉన్న నాట్ సివర్ బ్రంట్ (ఇంగ్లండ్; 731) మధ్య రేటింగ్ పాయింట్లలో భారీ అంతరం ఉండటం విశేషం.
భారత్‌తో మూడో వన్డేలో శతకం బాదిన బెత్ మూనీ (ఆ్రస్టేలియా) రెండు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరుకుంది. టాప్–10లో భారత్ నుంచి స్మృతి మినహా ఎవరూ లేకపోగా... కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్‌కు పడిపోయింది. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 5వ ర్యాంక్‌కు చేరుకుంది.
భారత్ నుంచి టాప్–10లో మరెవరూ లేకపోగా... స్నేహ్ రాణా 16వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఈ జాబితాలో సోఫియా ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్), యాష్లే గార్డ్‌నర్ (ఆ్రస్టేలియా), మేగన్ షుట్ (ఆ్రస్టేలియా) వరుసగా తమ టాప్–3 ర్యాంక్‌లు నిలబెట్టుకున్నారు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా దీప్తి శర్మ (4వ స్థానం)కు టాప్–10లో చోటు లభించింది.