టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అందించే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఏడాది మార్చి నెలకు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంపికయ్యాడు. సహచర ఆటగాడు, ప్రపంచస్థాయి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను కాదని ఈ అవార్డు సంజూను వరించడం విశేషం.
ఆరంభంలో జట్టులో చోటే కరువు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభంలో సంజూకు భారత తుదిజట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. అయితే, సూపర్-8 మ్యాచ్‌లలో అనూహ్య రీతిలో మేనేజ్‌మెంట్ అతడికి అవకాశం ఇవ్వగా.. సద్వినియోగం చేసుకున్నాడు సంజూ. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌లలో వెస్టిండీస్‌పై 97*, ఇంగ్లండ్‌పై 89 పరుగులతో దుమ్ములేపాడు.
ఫైనల్లోనూ ఇరగదీసిన సంజూ
ఇక ఫైనల్లో న్యూజిలాండ్ మీద కూడా 89 పరుగులతో రాణించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మొత్తంగా మార్చిలో మూడు మ్యాచ్‌లలో కలిపి సంజూ 275 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేటు 199.38. మరోవైపు.. బుమ్రా సైతం ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 14 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
సంజూకే దక్కిన అవార్డు
ఈ క్రమంలో సంజూ, బుమ్రాలతో పాటు సౌతాఫ్రికాకు చెందిన నయా ఆటగాడు కన్నార్ ఎస్తెరుజియెన్ కూడా మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే, వీరిద్దరిని ఓడించి సంజూ శాంసన్ ఈ పురస్కారం గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది.


