
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు సౌతాఫ్రికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రొటిస్ జట్టుకు భారీ జరిమానా విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌తో పర్యటిస్తోంది.
ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లో బవుమా బృందం అద్భుత విజయాలు సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం సఫారీలకు ఘోర పరాభవం ఎదురైంది.
రూట్, బెతెల్ శతకాలు
ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 342 పరుగుల తేడాతో బవుమా బృందం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. సౌతాంప్టన్ వేదికగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ జేమీ స్మిత్ (62) శుభారంభం అందించగా వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ (Joe Root- 100), జేకబ్ బెతెల్ (110) దానిని కొనసాగించారు.
బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ
రూట్, బెతెల్ శతకాలతో చెలరేగగా.. ఆఖర్లో జోస్ బట్లర్ (Jos Buttler) అజేయ మెరుపు అర్ధ శతకం (32 బంతుల్లో 62) సాధించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి ఏకంగా 414 పరుగులు సాధించింది. ప్రొటిస్ బౌలర్లలో కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
పేకమేడలా కుప్పకూలింది
ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఐడెన్ మార్క్రమ్ (0), రియాన్ రికెల్టన్ (1), వియాన్ ముల్దర్ (0), మాథ్యూ బ్రీట్జ్కే (4), ట్రిస్టన్ స్టబ్స్ (10), డెవాల్డ్ బ్రెవిస్ (6) పెవిలియన్‌కు వరుస కట్టారు.
డౌన్ ఆర్డర్లో కార్బిన్ బాష్ 20 పరుగులతో సౌతాఫ్రికా టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేశవ్ మహరాజ్ 17 పరుగులు చేయగలిగాడు. నండ్రీ బర్గర్ 2 పరుగులతో అజేయంగా నిలవడగా.. కెప్టెన్ తెంబా బవుమా ఆబ్సంట్ హర్ట్‌గా ఉన్నాడు. దీంతో 20.5 ఓవర్లలో కేవలం 72 పరుగులు చేసి సౌతాఫ్రికా 72 పరుగులకే ఆలౌట్ అయింది.
దీంతో ఇంగ్లండ్ చేతిలో 342 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. వన్డేల్లో ఏ జట్టుకైనా పరుగుల తేడా పరంగా ఇదే అతి భారీ ఓటమి. అలా సఫారీలు ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ మూడు, బ్రేడన్ కార్స్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
భారీ జరిమానా.. కారణం ఇదే
ఇదిలా ఉంటే.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాతో పాటు జట్టుకు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది.
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలలో ఒకరైన టీమిండియా మాజీ పేసర్ శ్రీనాథ్ జవగళ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక సారథి బవుమా తమ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండానే ఐదు శాతం జరిమానా ఖరారైంది.
చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు