రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో (Ranji Trophy 2025-26) ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో సైతం అర్ద సెంచరీతో (67) రాణించిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడంకెల మార్కును తాకాడు. 120 బంతుల్లో 11 బౌండరీల సాయంతో ఈ మార్కును చేరుకున్నాడు.
జైస్వాల్‌కు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో సెంచరీ (21 ఇన్నింగ్స్‌ల్లో). ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వది (టెస్ట్‌ల్లో 7 సెంచరీలు, భారత్-ఏ తరఫున 1, ముంబై తరఫున రంజీల్లో 5, రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున 2, వెస్ట్ జోన్ తరఫున 2).
2019లో రంజీ అరంగేట్రం చేసిన జైస్వాల్ ఈ సెంచరీతో 1000 పరుగుల మార్కును కూడా తాకాడు. 10 మ్యాచ్‌ల్లో 57కు పైగా సగటుతో ఈ పరుగులు చేశాడు. తాజా సెంచరీని జైస్వాల్ తన ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో (జైపూర్) చేయడం విశేషం.
చెలరేగిన రాజస్థాన్ బౌలర్లు
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకే ఆలౌటైంది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో యశస్వి జైస్వాల్ (67) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ముషీర్ ఖాన్ 49, షమ్స్ ములానీ 32, హిమాన్షు సింగ్ 25, తుషార్ దేశ్‌పాండే 25 (నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించారు.
రాజస్థాన్ బౌలర్లలో కుక్నా అజయ్ సింగ్ 4, అశోక్ శర్మ 3, అంకిత్ చౌదరి, ఆకాశ్ మహారాజ్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.
దీపక్ హుడా ద్విశతకం
అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో దీపక్ హూడా ద్విశతకంతో (248), కార్తిక్ శర్మ (139) శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (617/6) చేసింది. సచిన్ యాదవ్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు తీశారు. యశస్వి జైస్వాల్ బంతితోనూ రాణించి డబుల్ సెంచరీ వీరుడు దీపక్ హుడాను ఔట్ చేశాడు.
363 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి (52 ఓవర్లలో) 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (63), అజింక్య రహానే (18) ఔట్ కాగా.. జైస్వాల్ 105, సిద్దేశ్ లాడ్ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ముంబై రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 170 పరుగులు వెనుకపడి ఉంది.
చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య


