
ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ చాలాకాలం తర్వాత తనదైన మార్కు విధ్వంసం సృష్టించాడు. ద హండ్రెడ్ లీగ్-2025లో లండన్ స్పిరిట్‌కు ఆడుతున్న వార్నర్.. నిన్న (ఆగస్ట్ 9) వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు (లండన్ స్పిరిట్) నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
లండన్ స్పిరిట్ ఇన్నింగ్స్‌లో వార్నర్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 14, జేమీ స్మిత్ 26, ఆస్టన్ టర్నర్ 24, సీన్ డిక్సన్ 14, జేమీ ఓవర్టన్ 0, రే జన్నింగ్స్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో జోష్ హల్ 2 వికెట్లు తీయగా.. డేవిడ్ పేన్, రిలే మెరిడిత్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెల్ష్ ఫైర్.. జానీ బెయిర్‌స్టో (50 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికీ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బెయిర్‌స్టోతో పాటు క్రిస్ గ్రీన్ (32 నాటౌట్) అద్భుతంగా పోరాడినప్పటికీ వెల్ష్ ఫైర్ గెలవలేకపోయింది.
వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో, గ్రీన్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. స్టీవ్ స్మిత్ 3, లూక్ వెల్స్ 12, టామ్ ఏబెల్ 5, టామ్ కొహ్లెర్ 4, సైఫ్ జైబ్ 2, పాల్ వాల్టర్ 6 పరుగులకు ఔటయ్యారు. స్పిరిట్ బౌలర్లలో డేనియల్ వార్రల్ 2, లూక్ వుడ్, రిచర్డ్ గ్లీసన్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు.