గిల్‌ కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగి వస్తాడు: టీమిండియా దిగ్గజం | He Will Return With The Trophy: Kapil Dev On Gill Ahead Of Ind vs Eng Tests | Sakshi
Sakshi News home page

గిల్‌ కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగి వస్తాడు: టీమిండియా దిగ్గజం

Jun 19 2025 1:16 PM | Updated on Jun 19 2025 1:35 PM

He Will Return With The Trophy: Kapil Dev On Gill Ahead Of Ind vs Eng Tests

భారత టెస్టు క్రికెట్‌లో కొత్త శకం ఆరంభం కానుంది. దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, లెజెండరీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వంటి దిగ్గజాల నిష్క్రమణ తర్వాత.. యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్‌ గడ్డ మీద తొలి టెస్టు సిరీస్‌ ఆడబోతోంది. లీడ్స్‌లో శుక్రవారం నుంచి ఇరుజట్ల మధ్య పోటీ ఆరంభం కానుంది.

ఆ ముగ్గురికే సాధ్యమైంది
అయితే, ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ గెలవడం అంత సులువేమీ కాదు. ఇప్పటి వరకు టీమిండియా కేవలం మూడుసార్లు మాత్రమే అక్కడ విజయపతాక ఎగురవేసింది. 1971లో అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో.. 1986లో కపిల్‌ దేవ్‌ కెప్టెన్సీలో.. చివరగా 2007లో రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో ఇంగ్లండ్‌ను తమ స్వదేశంలో భారత్‌ ఓడించగలిగింది.

ఈ నేపథ్యంలో.. కఠిన సవాలుకు సిద్ధమైన గిల్‌ సేన.. సొంతగడ్డపై మరింత పటిష్టంగా కనిపించే స్టోక్స్‌ బృందాన్ని ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ భారత జట్టు కొత్త సారథి శుబ్‌మన్‌ గిల్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్‌ తప్పక ట్రోఫీతో తిరిగి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

ఈ మేరకు.. ‘‘అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. కచ్చితంగా ట్రోఫీతోనే అతడు ఇంగ్లండ్‌ నుంచి తిరిగి వస్తాడు. మనల్ని గర్వపడేలా చేస్తాడు. టీమిండియాకు గుడ్‌లక్‌. మనోళ్లు విజేతలుగా తిరిగి వస్తారు. వారికి ఆ సత్తా ఉంది’’ అని కపిల్‌ దేవ్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో వ్యాఖ్యానించాడు.

విచిత్రంగా అనిపించింది..
టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా దీనికి ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేసింది. ఈ విషయంపై స్పందించిన కపిల్‌ దేవ్‌.. ‘‘నాకైతే ఇది విచిత్రంగా అనిపించింది.

ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యం వేసింది. మరేం పర్లేదు. క్రికెట్‌లో అన్నీ జరుగుతాయి. క్రికెట్‌ అంటే క్రికెటే. మైదానంలో ఆటగాళ్ల స్ఫూర్తి అలాగే ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా పటౌడీ పేరును తొలగించడంపై ఈసీబీపై విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐ, టీమిండియా లెజెండరీ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ విజ్ఞప్తి నేపథ్యంలో.. భారత్‌- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ గెలిచిన కెప్టెన్‌కు పటౌడీ పేరిట పతకం అందించాలని ఈసీబీ నిర్ణయించింది.

చదవండి: ‘సచిన్‌, గంభీర్‌, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’

Advertisement
 
Advertisement
Advertisement