ఏడ్చేసిన హర్మన్‌ప్రీత్‌.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో | Harmanpreet Kaur Breaks Down After India Enter WC Final With Video Viral | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లలా ఏడ్చేసిన హర్మన్‌ప్రీత్‌.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో

Oct 31 2025 10:27 AM | Updated on Oct 31 2025 11:43 AM

Harmanpreet Kaur Breaks Down After India Enter WC Final With Video Viral

హర్మన్‌ను ఆలింగనం చేసుకున్న స్మృతి మంధాన (PC: BCCI)

ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌.. అమన్‌జోత్‌ కౌర్‌ (Amanjot Kaur) ఫోర్‌ బాది భారత్‌ విజయాన్ని ఖరారు చేయగానే సంబరాలు అంబరాన్నంటాయి.. పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2025 (WC 2025) ఫైనల్‌కు చేరగానే.. నవీ ముంబై జయహో భారత్‌ నినాదాలతో హోరెత్తిపోయింది..  

జెమీమా రోడ్రిగ్స్‌ భావోద్వేగం
అమన్‌జోత్‌ సంతోషంలో మునిగిపోతే.. సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్‌ భావోద్వేగంతో నేలతల్లిని ముద్దాడింది.. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది.. భారత ప్లేయర్లంతా మైదానంలోకి దూసుకువచ్చి జెమీమాతో కలిసి విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

చిన్నపిల్లలా ఏడుస్తూ
ఇక కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డగౌట్లో కోచ్‌లు, ఆటగాళ్లను హత్తుకుంటూ హర్మన్‌ కన్నీటి పర్యంతమైంది.. భావోద్వేగాలను నియంత్రించుకోలేక చిన్నపిల్లలా ఏడుస్తూ సొంతగడ్డపై సాధించిన చారిత్రాత్మక విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు చూసిన యావత్‌ భారతావని ఉద్వేగానికి లోనవుతూనే జయజయధ్వానాలు చేస్తోంది.. ‘న భూతో న భవిష్యతి’ అన్న చందంగా చాంపియన్‌ జట్టు ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళా జట్టును అభినందనలతో ముంచెత్తుతోంది.

ఆసీస్‌ను ఓడించి
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ మూడోసారి ఫైనల్‌కు చేరింది. నవీ ముంబై వేదికగా తాజా ఎడిషన్‌ రెండో సెమీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో కెప్టెన్‌, డేంజరస్‌ ఓపెనర్‌ అలీసా హేలీ (5)ను క్రాంతి గౌడ్‌ శుభారంభం అందించినా.. ఫోబీ లిచ్‌ఫీల్డ్‌, ఎలిస్‌ పెర్రీ భారత శిబిరానికి ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు మిగల్చలేదు. లిచ్‌ఫీల్డ్‌ శతక్కొట్టగా (119), పెర్రీ 77 పరుగులతో రాణించింది.

ఆరో నంబర్‌ బ్యాటర్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (45 బంతుల్లో 63) కూడా అర్ధ శతకంతో రాణించింది. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో ఆసీస్‌ 338 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లు షఫాలీ వర్మ (10), స్మృతి మంధాన (24) నిరాశపరిచారు.

ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా అజేయ శతకం (127)తో ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెకు తోడుగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) దంచికొట్టగా.. దీప్తి శర్మ (17 బంతుల్లో 24), రిచా ఘోష్‌ (16 బంతుల్లో 26) వేగంగా ఆడి విజయ సమీకరణాన్ని సులువు చేశారు.

ఆఖర్లో అమన్‌జోత్‌ (8 బంతుల్లో 15) కూడా మెరుపులు మెరిపించింది. ఫలితంగా 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 341 పరుగులు చేసిన భారత్‌.. ఆసీస్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ విజయంతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇందుకు నవీ ముంబై వేదిక.

చదవండి: Jemimah Rodrigues Emotional Video: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement