ఫైనల్లో ఓటమి అనంతరం గిల్‌ విశ్లేషణ | Gujarat Titans captain Shubman Gill comments after losing IPL 2026 final to RCB | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఓటమి అనంతరం గిల్‌ విశ్లేషణ

Jun 1 2026 8:40 AM | Updated on Jun 1 2026 7:35 PM

Gujarat Titans captain Shubman Gill comments after losing IPL 2026 final to RCB

నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్‌ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌లో సాధారణ స్కోర్‌కు (155-8) పరిమితమై, ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్‌ కోహ్లి (75 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.

సీజన్‌ ఆధ్యాంతం గుజరాత్‌ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు తుది సమరంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు (రజత్‌, కృనాల్‌) తీయడం మినహా, మిగతా బౌలర్లు చేసిందేమీ లేదు. కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేయగలిగినా, స్కోర్‌ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. మ్యాచ్‌ అనంతరం గుజరాత్‌ సారధి శుభ్‌మన్‌ గిల్‌ విశ్లేషణ ఇలా ఉంది. 

"180-190 పరుగులు చేసుంటే, మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. పిచ్ పూర్తిగా స్లోగా లేదు. ఆరంభ ఓవర్లలో మాత్రం పేసర్లకు కొంత సహకారం లభించింది.

ఆదిలోనే వికెట్లు కోల్పోవడం​ జట్టు మోమెంటంను దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో  వేగంగా పరుగులు చేయలేకపోవడం కష్టాలను అధికం చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగులు చేసినా, పవర్‌ప్లేలో రెండు-మూడు వికెట్లు తీసుంటే పోటీలో ఉండేవాళ్లం.

టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో పవర్‌ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాము. ఆ దశలో ప్రత్యర్థిని 50-55 పరుగులకు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.

సీజన్ మొత్తాన్ని పరిశీలిస్తే, మా బౌలింగ్‌ యూనిట్‌ అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత కూడా జట్టు వెనక్కి తగ్గకుండా, చిన్నచిన్న అంశాల్లో మెరుగుపడుతూ బలంగా తిరిగి వచ్చింది.

తుది మెట్టుపై ట్రోఫీ చేజారినా ఈ సీజన్‌ చాలా సంతృప్తినిచ్చింది. గెలిచినా, ఓడినా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎప్పుడూ ఉంటాయి. జట్టుగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అంశాలపై దృష్టి పెడతాము"

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement