PC: BCCI/IPL
ఐపీఎల్-2026 ఫైనల్ తొలి బెర్తు కోసం రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ)- గుజరాత్ టైటాన్స్ రేసులో నిలిచాయి. ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ధర్మశాల వేదిక. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆర్సీబీ- గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటాయి.
ఆర్సీబీకి కీలక సూచనలు
కాగా ఈ మైదానం బౌండరీలు చిన్నగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆర్సీబీకి కీలక సూచనలు చేశాడు. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడ్డ ఆర్సీబీ.. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నాడు.
ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కంటే బలంగా
ప్రస్తుతం గుజరాత్ బౌలింగ్ విభాగం.. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కంటే బలంగా కనిపిస్తోందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అయితే, గత చేదు అనుభవాన్ని మరిచి ఆర్సీబీ బౌలర్లు క్వాలిఫయర్-1పై దృష్టి సారిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు.
తేలిపోయిన భువీ, హాజిల్‌వుడ్
కాగా ఆర్సీబీ లీగ్ దశలో చివరగా సన్‌రైజర్స్‌తో తలపడి.. 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్ 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
నాలుగు ఓవర్ల కోటాలో భువీ 51, హాజిల్‌వుడ్ 55 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇక రసిఖ్ సలామ్ దర్ 52 పరుగులు ఇచ్చినప్పటికీ రెండు వికెట్లు తీయగలిగాడు. మిగిలిన వారిలో సూయశ్ శర్మ మూడు ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. కృనాల్ పాండ్యా రెండు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఇక రొమారియో షెఫర్డ్ మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడినప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా మెరుగైన స్థితిలో ఉండటంతో టేబుల్ టాపర్ స్థానాన్ని పదిలం చేసుకుని క్వాలిఫయర్-1లో అడుగుపెట్టింది.
ప్లే ఆఫ్స్‌లో కూడా విఫలమైతే..
ఈ నేపథ్యంలో సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ను ఆర్సీబీ వీలైనంత త్వరగా మర్చిపోవాలి. భువీ, హాజిల్‌వుడ్ విఫలమయ్యారు. వారికి అదొక దుర్దినం. ఇద్దరిలో ఒక్కరూ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు.
అయితే, ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు సాగాల్సిన కీలక సమయం ఇది. ఒకవేళ ప్లే ఆఫ్స్‌లో కూడా ఆర్సీబీ బౌలర్లు విఫలమైతే.. గుజరాత్ 255కు పైగా పరుగులు స్కోరు చేయవచ్చు. ఇక్కడ బౌండరీలు చాలా చిన్నవి కాబట్టి ఆ అవకాశం ఉంది.
ఆర్సీబీ బౌలింగ్ విభాగం గొప్పగా రాణించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే.. గుజరాత్ బౌలర్లు వీరి కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ ఈ విషయంలో తప్పక జాగ్రత్త వహించాలి’’ అని పేర్కొన్నాడు.
ఆర్సీబీ బౌలర్లు తేలిపోతే మాత్రం ఈ మ్యాచ్‌లో విజయం కష్టమేనని సెహ్వాగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.
చదవండి: మరీ ఇంత కుళ్లు పనికిరాదు!


